తెలంగాణలో చికున్‌గున్యా కేసులు, అమెరికా హెచ్చరిక జారీ
తెలంగాణలో చికున్ గున్యా కేసుల సంఖ్య పెరుగుతుంది. అమెరికా పౌరులు తెలంగాణలో సందర్శించవద్దని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది.
By : Shaik Saleem
Update: 2024-11-20 14:01 GMT
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చికున్‌గున్యా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. జంటనగరాలతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో చికున్‌గున్యా జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చికున్‌గున్యా కేసులు నమోదైన ఇళ్ల చుట్టూ 100 ఇళ్లలో సర్వే చేసి, దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా, ఈ కేసులు తగ్గడం లేదు. దీంతో తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ చికున్‌గున్యా పీడితులకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు.
- తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికుల్లో చికున్‌గున్యా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.అమెరికా దేశానికి చెందినగర్భిణులు తెలంగాణను సందర్శించడాన్ని పునరాలోచించుకోవాలని యూఎస్ సూచించింది. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో వైరస్ బారిన పడిన నవజాత శిశువులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కోవచ్చని అమెరికా పేర్కొంది.
- తెలంగాణ నుంచి తిరిగొచ్చే అమెరికా ప్రయాణికుల్లో చికున్‌గున్యా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.చికున్‌గున్యా వైరస్ వల్ల కలిగే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి ఈ ప్రాంతంలో ఆందోళనను పెంచింది. దీంతో యూఎస్ తన దేశ ప్రయాణికులకు ఆరోగ్య హెచ్చరికలను జారీ చేసింది.
చికున్‌గున్యా అంటే ఏమిటి?
చికున్‌గున్యా అనేది దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి, ఈడెస్ ఆల్బోపిక్టస్ దోమలు కుట్టిన తర్వాత 3-7 రోజుల తర్వాత చికున్ గున్యా లక్షణాలు కనిపిస్తాయి.జ్వరం,కీళ్ల నొప్పి ఈ వ్యాధి ముఖ్యమైన లక్షణమని వైద్యులు చెప్పారు. తలనొప్పి,కండరాల నొప్పి,దద్దుర్లు,కీళ్ల వాపు సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ వ్యాధి నుంచి చాలా మంది ప్రజలు ఒక వారంలోపు కోలుకున్నప్పటికీ, కొందరు నెలలు లేదా సంవత్సరాల పాటు దీర్ఘకాలిక కీళ్ల నొప్పిని అనుభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు
తెలంగాణలోని చికున్ గున్యా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు, సాక్స్ ధరించాలని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహా ఇచ్చింది.ఎయిర్ కండిషన్డ్ వసతి లేదా స్క్రీన్ చేసిన కిటికీలు, తలుపులు ఉన్నగదుల్లో నివాసముండాలని వారు సూచించారు. దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో, సాధారణంగా ఉదయం,సాయంత్రం బహిరంగంగా కార్యకలాపాలను నివారించాలని వైద్యులు కోరారు.
గర్భిణులు జాగ్రత్త
గర్భిణీ స్త్రీలు తెలంగాణను సందర్శించడాన్ని పునరాలోచించుకోవాలని యూఎస్ సూచించింది. బిడ్డ పుట్టిన సమయంలో వైరస్ బారిన పడిన నవజాత శిశువులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటారని యూఎస్ హెచ్చరించింది.తెలంగాణలో గత సంవత్సరాల కంటే 152 చికున్‌గున్యా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.దోమలను నియంత్రించడంలో సాధారణంగా ఉపయోగించే ఫాగింగ్ పద్ధతి తక్కువ ప్రభావవంతంగా మారిందని నిపుణులు గుర్తించారు.