‘కేంద్రంది గాడిద గుడ్డు బడ్జెట్’

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.;

Update: 2025-02-01 10:15 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు కోడలు అయ్యుండి కూడా తెలంగాణపై కనీస కనికరం కూడా చూపలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కేంద్రంది గాడిద గుడ్డు బడ్జెట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌ను దేశం మొత్తానికి కూడా కొన్ని రాష్ట్రాలకే అన్నట్లు రూపొందించారని విమర్శించారు. ఇందులో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

‘‘తెలుగు మహిళ అయిన నిర్మలా సీత రామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు శుభాకాంక్షలు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం. తెలంగాణ కు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చింది. బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరాణాలు ఇచ్చారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తుంది. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తోంది. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ది పొందడం కోసం బీజేపీ.. కేంద్ర బడ్జెట్‌ను ఉపయోగించుకుంటుంది. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే మొత్తాన్ని బడ్జెట్‌లో అందరికి సమానంగా ఇవ్వాలి. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు గారి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా. తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి’’ అని ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ లు కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేశారు. రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐ.టి.ఐ.ఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రం నుంచి రూ.40 వేల కోట్ల జీఎస్టీ కేంద్రానికి చేరుతోంది. మరి ఆ మేరకు అయినా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీజేపీ వివక్ష చూపడం అన్యాయం. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ కు అవసరమైన అంశాలలో సహకారాన్ని అందించాలి’’ అని కోరారు.

Tags:    

Similar News