వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ఆమోదం
32 సంవత్సరాల క్రితం మూతపడిన విమానాశ్రయాన్ని మళ్ళీ యాక్షన్‌లోకి తీసుకురావాలని కేంద్రం నిశ్చయించుకుంది.;
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి ఎట్టకేలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎంతో కాలంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విమానాశ్రయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు చేస్తున్నా కేంద్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. కాగా ఎట్టకేలకు తాజాగా ఈ అభివృద్ధి పనులకు కేంద్రం అనుంచి అనుమతులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. 32 సంవత్సరాల క్రితం మూతపడిన విమానాశ్రయాన్ని మళ్ళీ యాక్షన్‌లోకి తీసుకురావాలని కేంద్రం నిశ్చయించుకుంది. ఇందుకు అడ్డుగా ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం ఉండకూదన్న ఒప్పందంపై కూడా కసరత్తులు చేసి.. ముందడుగు వేసింది. మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే ఈ విమానాశ్రయ అభివృద్ధి కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ప్రతిపాదనలు చేసింది. మామునూరు విమానాశ్రయ అభివృద్ధి ద్వారా వరంగల్ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని తన ప్రతిపాదనల్లో పేర్కొంది. వరంగల్ జిల్లాలో విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చాలా కీలకంగా మారుతుందని చెప్పారు.
కానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్‌పోర్ట్ ఉండకూదని జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. అందువల్లే మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్రం అనుమతులివ్వలేకపోయింది. కాగా తాజాగా జీఎంఆర్ సంస్థతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేక చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి జీఎంఆర్ అంగీకరించింది. జీఎంఆర్ నుంచి అంగీకారం రావడంతో విమానాశ్ర అభివృద్ధి పనులను చేపట్టడానికి కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా త్వరితగతిన విమానాశ్రయ అభివృద్ధి పనులను ప్రారంభించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
మామునూరు విమానాశ్రయ విస్తరణకు కావాల్సిన 256 ఎకరాల సేకరణ కోసం రూ.205కోట్ల నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో జీవోను కూడా విడుదల చేసింది. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానిక అడ్డుగా ఉనన 150 కిలోమీటర్లలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. మామునూరు విమానాశ్రయం ఇప్పటికే 696 ఎకరాల్లో ఉంది. ఆ భూమికి అదనంగా ఇప్పుడు మరో 253 ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా మరో కొత్త రన్‌వేను నిర్మించనున్నారు. టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ మేరకు విషయాన్ని రోడ్లు, భవనాల శాఖ వెల్లడించింది. భారత్, చైనా యుద్ధం సమయంలో ఈ ఎయిర్‌పోర్ట్ కీలక పాత్ర పోషించింది.