Revanth Reddy | ‘బీఆర్ఎస్ వాళ్లను వేరే దేశాల్లో అయితే ఉరి తీసేవాళ్లు’
తెలంగాణ అసెంబ్లీ ఏడో రోజు సమావేశాల్లో బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఏడో రోజు సమావేశాల్లో బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అసలు ఈరోజు రాష్ట్రానికి ఇలాంటి ఆర్థిక దుస్థితి పట్టడానికి కారణం వారేనని బీఆర్ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని తూర్పారబట్టారు. రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. వారి తప్పులు బయటపడుతుండటంతో కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, కానీ తమ పార్టీ నేతలు ఎంతో సహనంతో మెలుగుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయంలో ఇచ్చి పుచ్చుకోవడం చేస్తుంటారని, అది వారి డీఎన్‌ఏలో ఉందని చురకలంటించారు. అప్పులు చేయడంలో బీఆర్ఎస్ నేతలు సిద్ధహస్తులు అయిపోయారని, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పులకన్నా బీఆర్ఎస్ కుటుంబం చేసిన అప్పే అధికంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
‘‘అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్క కుటుంబం చేసిన అప్పు రూ.6లక్షల 40వేల కోట్లు. మళ్ళీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మాటకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.27లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నారు. మీరు చేసి వెళ్లిపోయిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఈ అప్పులు చేయాల్సి వచ్చింది. మా జేబులు నిండితో చాలు రాష్ట్రం ఏమైపోతే మాకేంటి అన్నట్లు ఇష్టారాజ్యంగా వడ్డీ రేట్లతో అప్పులు దండుకున్నారని, వాటి అప్పులు కట్టడానికి ఇప్పుడు మా ప్రభుత్వం దుంపతెగుతుంది. ఆ అప్పులే లేకుండా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చి ప్రతి హామీని ఇప్పటికే నెరవేర్చి ఉండేవాళ్లం. చెప్పని మరెన్నో హామీలను కూడా తీసుకొచ్చి ఉండే వాళ్లం. అందులో సందేహం అక్కర్లేదు. కానీ బీఆర్ఎస్ చేసిన అప్పుల కారణంగానే తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది. ఇచ్చిన మాటను మా పార్టీ ఎప్పటికీ తప్పదు. తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు.. కేసీఆర్ సభలోనే లేడు. అయినా చెప్పిన మాట ప్రకారం మా నాయకురాలు సోనియా గాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అందుకుగానూ కేసీఆర్.. ఆమె కాళ్లపై బొక్కబోర్లా పడ్డాడు’’ అని చెప్పుకొచ్చారు.
ప్రతి రూపాయి లెక్కే..
‘‘రోశయ్య ప్రతి రూపాయి లెక్కగట్టి పోదుపు చేశారు. దాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండే తెలంగాణను అప్పులు రాష్ట్రంగా మార్చారు. మిత్తీలు కట్టడానికే కొత్త అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. 16మంది సీఎంలో రూ.72వేల కోట్లు అప్పులు చేస్తే వీళ్లు దివాలా చేశారు. పదేళ్ల పాలనలో రూ.7.22 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజల మెడలో గుదిబండలు వేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఆలస్యానికి బీఆర్ఎస్ వాళ్లు చేసిన పాపాలే కారణం. లేకుంటే అవి ఎప్పుడే అమలై ఉండేవి’’ అని చెప్పారు.
ఢిల్లీకి అందుకే వెళ్తున్నా..
‘‘మాటకొస్తే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. నేను ఢిల్లీకి పయనమైన ప్రతిసారి అది రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికి 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని, మళ్ళీ 31వ సారికి రెడీ అవుతున్నారని లెక్కలు తీస్తున్నారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే నేను ఢిల్లీ వెళ్తోంది.. మరిన్ని అప్పులు తేవడానికి కాదు. గత ప్రభుత్వం ఆలోచనపాలోచన లేకుండా 11.5 శాతం, 12శాతం వడ్డీలకు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. కదా.. వీటి వడ్డీలు తగ్గించమని అడ్డుకోవడానికి వెళ్తున్నా. ఆ వడ్డీని ఒక 7-8 శాతానికి తీసుకొస్తే రాష్ట్రానికి ఉపశమనం కలుగుతుంది. ఈ తరహాలో పాలకులు అప్పులు చేసి వదిలేస్తే ఇక్కడ కాబట్టి చెల్లుబాటవుతుంది. అదే సౌదీ వంటి దేశాలలో అయితే ఇలాంటి పాలకులను బహిరంగంగ ఉరి తీసేవాళ్లు. లేకపోతే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూ.లక్ష కోట్లతో కూలేశ్వరం కట్టారు..
‘‘కొన్ని ప్రముఖ ప్రాజెక్ట్‌లకు వరల్డ్ బ్యాంక్ కేవలం 2శాతానికే రుణాలు ఇస్తుంది. కానీ అటు వెళ్లకుండా 11.5శాతం వడ్డీకి రుణాలు తెచ్చిన వారిని ఏమనాలి. పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కూళేశ్వరం నిర్మించారు. దాని ద్వారా కేవలం 50వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. దీని వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది. 50వేల ఎకరాలకు నీరందించడం కోసం రూ.లక్ష కోట్ల వ్యయంతో కూలేశ్వరం కట్టాల్సిన అవసరం ఉందా. వారు చేసిన అప్పులు వల్లే ఈరోజు మా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించలేనిపరిస్థితలో ఉంది. ఈ అప్పులే లేకుండా అన్నింటికీ ఒక నెల ముందే అడ్వాన్స్‌లు ఇచ్చి ఉండే వాళ్లం. పదేళ్ల పాలించి వాళ్లు రాష్ట్రానికి ఇచ్చింది అప్పులు. రూ.40,154 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి బదిలీ చేశారు. పదేళ్లలో విధ్వంసానికి మారుపేరులా పాలన సాగించారు’’ అంటూ మండిపడ్డారు సీఎం.