Farmers Day | రైతుభరోసాపై బీఆర్ఎస్ రచ్చ, మంత్రి తుమ్మల ఘాటు కౌంటర్

రైతు దినోత్సవ వేళ తెలంగాణలో రైతు భరోసాపై రచ్చ రాజుకుంది.రైతు భరోసాను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించగా, మంత్రి తుమ్మల ఘాటు కౌంటర్ ఇచ్చారు..

Update: 2024-12-23 14:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో రైతు దినోత్సవం వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య రచ్చ రాజుకుంది.

- ‘‘తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఆంక్షలు పెట్టి 40 లక్షల మంది రైతులకు రైతు భరోసాను ఎగ్గొట్టే కుట్ర చేస్తుంది’’అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించింది.
- ‘‘సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణ మాఫీపై మాట తప్పి రైతులను మోసం చేశారు,అమ్మవారు చాలా పవర్ ఫుల్, ఇప్పటికైనా తప్పైందని వెళ్లి అమ్మవారి ముందు తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకో’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు సోమవారం ఎక్స్ లో పోస్టు చేశారు.

తుమ్మల సంధించిన ప్రశ్నలు
- ‘‘అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతు భరోసాపై చర్చ పెట్టి గౌరవసభ్యులు అభిప్రాయాలు తెలియచేయమని అడిగితే, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి గత పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు పర్చని వారు కొత్త నాటకాలకు తెర లేపారు’’అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన రైతుబంధులో కూడా రూ.21,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు , తమ ప్రభుత్వం ఇప్పుడుకొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికీ రైతుబంధు ఇద్దామని అంటే కొత్త నాటకాలను తెరతీస్తున్నారని తుమ్మల ఆరోపించారు. మాయమాటలు చెప్పి మరొక సారి రైతాంగాన్ని ఆందోళనలో నెడుతున్నారని, లేఖలతో ఈ సారి కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు .
- గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా బడ్జెట్ లో 35 శాతం ప్రకటించి ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయమనేది? అని తుమ్మల ప్రశ్నించారు. రైతుబంధు పథకంలో 2019-20 సంవత్సరంలో రెండు పంట కాలాలలో పూర్తిగా డబ్బులు చెల్లించని మాట వాస్తవం కాదా!అని ఆయన అడిగారు.2023 యాసంగి రైతుబంధు 7600 కోట్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అని తుమ్మల బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
- ‘‘రైతుబంధు పేరు చెప్పి అన్ని పథకాలకు వ్యవసాయ యాంత్రికరణ, పంటల భీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి మరెన్నో పథకాలను అటకెక్కించి, రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్ర కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్, నిధులు రూ. 3005 కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోభానికి కారణమైన మీరా ఈ ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పేది!’’అని తుమ్మల నిలదీశారు.
‘‘మీరు చేసిన రుణమాఫీ 2014, 2018 పై రైతుల వద్దకు వెళ్ళి ఆడగ గలరా? అసలు ఆ పథకాలు రుణమాఫీ అని పెట్టడం కంటే వడ్డీ మాఫీ అంటే బాగుండేడెమో! 2018 రుణమాఫీలో 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా !’’అని తుమ్మల పేర్కొన్నారు.

వరి వేస్తె ఉరి అన్నారు...
‘‘వరి వేస్తె ఉరి అని, మొక్కజొన్న వద్దు అని, సన్నాలు సాగు చేయమని, పత్తి వద్దని మీకు ఏది తోస్తే అది చెప్పి, ఏ ఒక్క సందర్భంలో కూడా మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకున్న పాపాన పోనీ వైనం మీదైతే, ఈ సంవత్సర కాలంలోనే రూ. 695 కోట్లు వెచ్చించి, పత్తి, వరి కాకుండా రైతు పండించిన ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తూ, ఎకరానికి మీరు పెట్టిన పరిమితులను కూడా, పెరిగిన దిగుబడుల ఆధారంగా పెంచుతూ, కొనుగోలు చేస్తున్న మమ్మల్ని మీరు నిలదీయమనేది’’అని తుమ్మల ప్రశ్నించారు.‘‘ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.దేశానికి అన్నం పెట్టే అన్నదాత రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది’’అని తుమ్మల ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.


Tags:    

Similar News