ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్స్ స్పీడప్
పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాని పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టు కనిపించడం లేదు.
పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాని పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఆధిపత్యం కోసం ఇంకా శ్రమిస్తున్నట్టే అనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడి హోదా తీసుకున్నప్పటికీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారు. అధికారం లేకపోతే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు, అడుగు కూడా బయటపెట్టట్లేదు, ప్రతిపక్ష నేత హోదాలో కూర్చోలేక అసెంబ్లీకి కూడా రావట్లేదు అని వాయిస్తున్న ప్రత్యర్థుల విమర్శల పోరు పడలేక ఒక్కరోజు బడ్జెట్ సమావేశలకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్యాస్, ట్రాష్.. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇచ్చాం, ఇక చీల్చి చెండాడతాం.. అని చెప్పి ఇంక అడ్రెస్ లేరు.
మరోవైపు పాతాళానికి పడిపోయింది అనుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించింది. కేసీఆర్ తాను పురుగులా చూసిన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇది కేసీఆర్ కి జీర్ణించుకోలేని ఓటమి. ఇదిలా ఉండగా... పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. పైపెచ్చు ఎమ్మెల్యేలను రేవంత్ తమ పార్టీలోకి లాగేసుకుంటున్నాడు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఇంకా 10 మంది మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పనైపోయినట్టేనా? ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా? అనే చర్చలు కూడా నడుస్తున్నాయి.
ఆధిపత్యం కోసం ఆరాటం...
ఇలాంటి తరుణంలో మేము బలంగా ఉన్నాము, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్.. ఇక్కడ ప్రాంతీయ పార్టీగా మాదే ఆధిపత్యం, ఏదో గాలివాటంలో కాంగ్రెస్ గెలిచింది కానీ మెజారిటీ ప్రజల మనసులో బీఆర్ఎస్ పదిలం అని రుజువు చేసుకోవాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. అయితే రుజువు చేసుకోవడం ఎలా? కాంగ్రెస్, బీఆర్ఎస్ తలపడాలి, బీఆర్ఎస్ గెలవాలి... ఓడినా స్వల్ప తేడా ఓట్లతోనే అయ్యుండాలి. ఇప్పట్లో ఆ అవకాశం కూడా లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడో క్లారిటీ లేదు. ఉప ఎన్నికలు కూడా బీఆర్ఎస్ కి మరో ఆప్షన్ గా చెప్పొచ్చు. బీఆర్ఎస్ కూడా ఉపఎన్నికలపై ఆశలు పెట్టుకుందనడానికి కేటీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పవచ్చు.
ఫిరాయింపులపై పోరాటం...
అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ న్యాయపోరాటానికి ప్రయత్నాలు స్పీడప్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టులో కేసు వేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ నిపుణులతో కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం సమావేశమయ్యింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది.
సమావేశంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించి సుప్రీం కోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీం కోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
ఉపఎన్నికలు తప్పవు...
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని... పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్ద పూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.