Kavitha | ‘తెలంగాణ వందేళ్లు వెనక్కు వెళ్తోంది’

తమకు 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు కవిత.;

Update: 2025-01-30 12:54 GMT

అభివృద్ధిలో తెలంగాణ తిరోగమనం చెందుతుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వందేళ్లు వెనక్కు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రంలో అత్యంత భయంకర పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసీతెలియన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారని, తమకు 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ‘‘అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి గారి బొమ్మ కనబడుతుంది. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. తాము చెప్పినవాళ్ళకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తున్నారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారామె.

‘‘ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పాలన కొనసాగించలేరు. అలివిగాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్. యూరియా కోసం రైతులు మళ్ళీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చింది. కరెంటు ఎప్పుడొస్తుందా ఎప్పుడు పోతుందా అనేది తెలియని దుస్థితి రాష్ట్రంలో ఉంది. చెరువులను ప్రభుత్వం పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం ఇది’’ అని ధ్వజమెత్తారు కవిత.

‘‘పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లనే ఇంకా ఇస్తున్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఏమయ్యాయి? తెలంగాణను ఆంధ్రతో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాలు, దగానే ఉంటాయి. కేసీఆర్ అర్హులైన అందరికీ పారదర్శకంగా పథకాలను అందించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చేశామని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌కు సిగ్గులేదా?’’ అని ప్రశ్నించారు.

Tags:    

Similar News