కవిత జ్యూడిషియల్ కస్టడీ మళ్ళీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో మరోసారి ఎమ్మెల్సీ కవితకి నిరాశే ఎదురైంది. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

By :  Vanaja
Update: 2024-04-23 11:16 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో మరోసారి ఎమ్మెల్సీ కవితకి నిరాశే ఎదురైంది. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ ఈ నెల 11 న అరెస్టు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఈరోజుతో కవిత కస్టడీ ముగియనుండటంతో అధికారులు ఆమెను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు సంస్థలు మరో 14 రోజులు ఆమెని కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఆమె మే 7 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు.

బెయిల్ పిటిషన్ వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత అప్లై చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఆమె బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ తరపున లాయర్ జోయాబ్ హుస్సేన్, కవిత తరపున లాయర్ నితేష్ రాణా వాదనలు వినిపించారు. ఈడీ వాదనల అనంతరం న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరు వర్గాలు వాదనలు వినిపించనున్నారు.

ఈడీ వాదనలు...

కవితకి బెయిల్ ఇవ్వొద్దని వాదించిన ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్.. ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకి తెలిపారు. కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆమె అరెస్టు సెక్షన్ 19 కి అనుగుణంగా జరిగిందని కోర్టుకి వివరించారు.

"తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. అయితే ఆమెను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు. 2023 సెప్టెంబర్ 26న తదుపరి 10 రోజులు సమన్లు ఇవ్వబోమని ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చింది. మార్చి 15న సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశాం. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ని మార్చి 19న ఆమె ఉపసంహరించుకున్నారు. కవితకు వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కవితను సూర్యాస్తమయం కంటే ముందే అదుపులోకి తీసుకున్నాం. కవిత అరెస్టు సాయంత్రం 5.20 గంటలకు జరిగింది. ఆరోజు హైదరాబాద్ లో సూర్యాస్తమయం సాయంత్రం 6.26 గంటలకు అయ్యింది. ఇండోస్పిరిట్స్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ పిళ్లై ఉన్నారు. అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నాం. కవితను అరెస్టు చేసిన 24గంటల్లో కోర్టులో హాజరుపరిచాం. సౌత్ గ్రూప్ లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్ మండూరి బినామీగా ఉన్నారు" అని ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు.

Tags:    

Similar News