హౌస్ అరెస్ట్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం..
హౌస్ అరెస్ట్లయినా మానుకోండి.. లేదా నాకో ఇల్లు ఇప్పించి కిరాయి కట్టుకోండని ప్రభుత్వానికి ఆర్ఎస్ సూచించారు.;
సంక్రాంతి పండగ వేళ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. పండగపూట పొద్దుపొద్దున్నే తాను నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌కు పోలీసులు పంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కార్‌కు అసలు తలకాయ ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పండగపూట పొద్దుపొద్దున్నే రేవంత్ ప్రభుత్వం మళ్ళీ తమ అపార్ట్మెంట్ దగ్గర పోలీసులను మొహరించారని మండిపడ్డారు. అసలు ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారంటే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని, దానిని నియంత్రించడానికే ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నామని చెప్పారని వివరించారు. కాగా అవును.. తమ నేత అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా బరాబర్ పోరాటం చేస్తామని, అది తమ బాధ్యత అని ప్రవీణ్ పేర్కొన్నారు. అలాగని స్వప్రయోజనాల కోసం విధ్వంసం సృష్టించే సంస్కృతి తమకు లేదని అన్నారు. ఈ మేరకు ముందస్తు హౌస్ అరెస్ట్‌లను విమర్శిస్తూ ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘సంక్రాంతికి పోలీసులు పొద్దున్నే మా ఇంటికి వచ్చిండ్రు! ఇంత పొద్దున్నే అదీ పండగ పూట మా అపార్ట్మెంట్ ముందు మళ్లీ పోలీసులను మొహరించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకు వచ్చిండ్రు అంటే పాడి కౌశిక్ రెడ్డి కోసం మేమేమైనా పోరాటం చేస్తామని మా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని అంటున్నారు. అవును బరాబర్ చేస్తం కూడా. అది మా బాధ్యత. కానీ కాంగ్రెస్ గూండాల లాగా పార్టీ కార్యాలయాలపై మూకుమ్మడిగా దాడులకు పాల్పడి విధ్వంసం చేసే సంస్కృతి మాకు లేదు. సీఎం రేవంత్.. ఇప్పటికి మీరు ఎన్నో సార్లు నన్ను గృహ నిర్బంధంలో ఉంచిండ్రు. నాకు హైదరాబాదు నగరంలో సొంత ఇల్లు కూడా లేదు. అద్దెకు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్న. ప్రతిసారి మా ఇంటికి పోలీసులు వచ్చి హడావిడి చేయడం వల్ల ఈ కాంప్లెక్స్‌లో మిగతా కుటుంబాలు చాలా ఆందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురైతున్నారు. వాళ్లు నాపై సానుభూతిని చూపిస్తున్నారు, మీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మేము పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు వారి గొంతుకగానే పోరాడుతూనే ఉంటాం. మేం మారము. మీరు మారుతారన్న నమ్మకం కూడా మాకు లేదు. ఈ యుద్ధానికి విరామం లేదు. మిగతా అపార్ట్మెంట్ వాసుల స్వేచ్ఛ, జీవించే హక్కులను దృష్టిలో ఉంచుకుని నాకు మీ ప్రభుత్వమే ఒక ఇంటిని కేటాయించి కిరాయి మీరే కట్టుకోండి. లేదా చీటికి మాటికి మీ పోలీసులను మా అపార్ట్‌మెంట్‌కు పంపించడం మానేయండి’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యానించారు.