Revanth Reddy | రైతు భరోసాలో ఇన్ని బొక్కలున్నాయా..!
రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. మొత్తం చెప్పేసిన రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరిగా అందడం లేదు. రుణమాఫీ సరిగా జరగలేదు. ఆఖరికి రైతు భరోసా కూడా అందడం లేదంటో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతుభరోసా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఏడో రోజు సమావేశాల్లో మాట్లాడారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు సంక్షేమం అందించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, రైతులకు ఎలా చేస్తే మేలు చేకూరుతుందని రాత్రింబవళ్లు నిపుణులు, మేధావులతో చర్చిస్తున్నామని సీఎం అన్నారు. ‘‘రైతుభరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. రైతులను ఆదుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది. భూమినే నమ్ముకుని, భూమిని అమ్మగా భావించిన రైతులను ఆదుకోవాలనేదే మా ఆలోచన’’ అని చెప్పారు.
‘‘రైతు బంధు ఉద్దేశం పెట్టుబడి సాయం పథకం.. పెట్టుబడి సాయం ఎవరికి ఉండాలి....? గత ప్రభుత్వం పదేళ్లలో రూ.72,817 కోట్లు రైతు బంధు రూపంలో ఖర్చు చేసింది. సాగులో లేని భూములకు, గుట్టలు, లే-అవుట్లకు, నేషనల్ హైవేస్‌కు కూడా రైతు బంధు ఇచ్చారు. రూ.72,817 కోట్లలో దాదాపు రూ.22వేల కోట్లు అనర్హులకు ఆయాచిత లబ్ది చేకూర్చారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా? గతంలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారి కూడా రైతు బంధు ఇచ్చారు. ఆమన్ గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. వాళ్ల అనుయాయులు కొందరు నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పొందారు’’ అని ఆరోపించారు.
‘‘హైదరాబాద్ చుట్టుపక్కల 50కి.మీ పరిధిలో 70 నుంచి 80శాతం వ్యవసాయం చేయడం లేదు. కానీ గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల 3కోట్ల ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్లారు. రైతు బంధు రూపంలో వేలాది కోట్ల కొల్లగొట్టారు. 80వేల పుస్తకాలు చదివిన మేథస్సుతో రైతు భరోసాపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇస్తారని మేం భావించాం. చివరి పేద వాడికి కూడా ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేయాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. వాళ్లు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని అందరికీ ఇవ్వాలంటున్నారు.. వాళ్ళను ఆదర్శంగా తీసుకోమంటున్నారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే వాళ్లలాగే మేం ఇక్కడ ఉండం. వాళ్ల స్థానంలో ఉంటం’’ అని చురకలంటించారు.
‘‘మాకు రైతులు ఆదర్శం.. రైతు సంక్షేమమే మాకు ముఖ్యం.. సభలోకి వస్తే సమాజం ముందు తల దించుకోవాల్సి వస్తుందనే ఆలోచనతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదేమో. రాళ్లు రప్పలు, గుట్టలు, రియల్ లే అవుట్లకు, నేషనల్ హైవేలకులకు రైతు భరోసా ఇద్దామా? ప్రతిపక్షంగా ఒక స్పష్టమైన సూచన ఇవ్వండి. మీ సూచనలు సహేతుకమైతే మేం వినడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు.
‘‘ 2019లో నేను పార్లమెంట్ లో రైతు ఆత్మహత్యలపై నేను అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం ఇచ్చారు. 2014,2015,2016 కు సంబంధించి రైతు ఆత్మహత్యలపై సభలో సమాధానం ఇచ్చారు. ఏపీలో 2014లో 160, 2015లో 516, 2016లో 239 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 2014లో 2568, 2015లో 3030, 2016లో 2550 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల ఏలుబడిలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 2014లో 898, 2015లో 1358, 2016లో 632 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మనకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని ఆత్మహత్యలు జరగలేదు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వాళ్లు తల దించుకుని రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతులకు వాస్తవాలు తెలుసు కాబట్టే వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఏడాదిలో మేం ఏం చేశామని ఇన్నిసార్లు అడుగుతున్నారు.. పదేళ్లలో మీ హయాంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకోండి. ఐదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీకి వాళ్లు ఖర్చు చేసింది రూ.16,143 కోట్లు.. అది కేవలం మిత్తికే సరిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక వీళ్లు చేసిన రుణమాఫీ రూ.11, 909 కోట్ల 31 లక్షలు మాత్రమే. ఇందులో 8,515 కోట్లు మిత్తికె సరిపోయింది. మీరు చేసిన రుణమాఫీ కేవలం రూ.3384 కోట్లు మాత్రమే... ఇదీ మీ చరిత్ర. పదేళ్లలో వారు చేసిన రుణమాఫీ రూ.27వేల కోట్లు. 27 రోజుల్లో దేశంలో ఎక్కడా లేని విదంగా మొదటి ఏడాదిలోనే 25,35,963 రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి మా ప్రభుత్వం రైతుల రుణం తీర్చుకుంది’’ అని అన్నారు.
‘‘ఇది మా గొప్పతనంగా మేం అనుకోవడంలేదు... ఇది మా బాధ్యతగా భావిస్తున్నాం.రైతు రుణమాఫీకి 11 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023 వరకు ఐదేళ్ల మధ్య రైతుల లోన్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం. వాళ్లు ఎగ్గొట్టినవి, బకాయిలు పెట్టినవి మేం పరిగణలోకి తీసుకోలేదు. ఆనాడు..రైతులకు ఇవ్వడానికి 8వేల కోట్లు కూడా లేవని చెప్పి.. ఇప్పుడు రైతుల కోసమే బతుకుతున్నట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడటం సమంజసమేనా? మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు కేసీఆర్ సభలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ.. అక్కడ అరుస్తున్నాయన సోనియా దగ్గరికి వెళ్లి బొక్కబోర్ల కాళ్లపై పడిన సంగతి ఆయన మరిచిపోయారు.. కృతజ్ఞత లేని మనుషులు వాళ్లు’’ అని విమర్శించారు.