SLBC టన్నెల్ బురదలో కూరుకుపోయిన మృతదేహాలు వెలికితీస్తాం
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల బురదలో ఐదు మృతదేహాలను వెలికితీసే పనులు ముమ్మరం చేశామని నాగర్ కర్నూలు జిల్లా అధికారులు ప్రకటించారు.;
By : Shaik Saleem
Update: 2025-03-01 03:43 GMT
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ లోపల బురదలో ఐదు మృతదేహాలు కూరుకుపోయాయని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. బురద నుంచి మృతదేహాలను వెలికితీసే పనులు ముమ్మరం చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) పరికరంతో పరీక్షించగా బురద లోపల మృతదేహాలున్నాయని తేలిందని నాగర్ కర్నూలు అదనపు కలెక్టర్ బి దేవ సహాయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మృతదేహాలు వెలికితీసేందుకు ముమ్మర యత్నాలు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ లోపల మృతదేహాలను వెలికితీసేందుకు తాము ముమ్మర యత్నాలు చేస్తున్నామని నాగర్ కర్నూలు అదనపు కలెక్టర్ బి దేవసహాయం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.అయిదు మృతదేహాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయని స్కానింగులో వెల్లడైందని, బురదను తొలగించి శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మృతదేహాలను వెలికితీస్తామని దేవసహాయం వివరించారు.
టన్నెల్ కూలిపోయి 8 రోజులు
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ఫిబ్రవరి 22వతేదీన కూలిపోయింది. టన్నెల్ కూలిపోయి 8 రోజులు కావడంతో సహాయ పనుల్లో జరిగిన జాప్యంతో లోపల చిక్కుకున్న వారు విగతజీవులుగా మారారని ఓ మిలటరీ అధికారి చెప్పారు. టన్నెల్ కూలినపుడు రాళ్లు, బురద ఒక్కసారిగా మీద పడటంతో అందులో కార్మికులు కూరుకుపోయారని సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఓ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి చెప్పారు.
టన్నెల్ వద్ద ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ క్యాంప్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ వద్ద భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్,బీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైన్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు మూడు బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి రాత్రి వరకు షిప్టుల వారీగా టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ వద్దనే టెంట్లు వేసి ఇక్కడే నివాసముంటున్నారు.
టన్నెల్ వద్దకు ఉస్మానియా వైద్యబృందం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ వద్దకు హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం ఉస్మానియా వైద్యబృందాన్ని రప్పించారు.బురద నుంచి మృతదేహాలు వెలికితీయగానే అక్కడే ఉస్మానియా వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి మృతుల కుటుంబాలకు శవాలను అప్పగించాలని నిర్ణయించారు. టన్నెల్ వద్ద పోలీసు భద్రతను పెంచడంతోపాటు అక్కడకు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.