తెలంగాణలో సోనియా ప్రకంపనలు

రాష్ట్రంలో సోనియా గాంధీ రాకపై ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణ ఇచ్చిన దేవతగా ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ ఆహ్వానిస్తామంటే.. ఏ హోదాలో అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

By :  Vanaja
Update: 2024-05-23 13:59 GMT

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2 న జరిగే వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ చేతుల మీదగా జరుగుతున్న ఈ వేడుకలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు.. ఆమె చేతుల మీదుగా అందెశ్రీ రచించిన రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ"ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు.

ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. ఆమె రాకపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. సోనియా గాంధీని ఏ హోదాలో అధికారిక కార్యక్రమానికి ఆహ్వానిస్తారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక రాష్ట్రం సోనియా ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారని, ఎంతోమంది ప్రాణత్యాగాలు మీద రాష్ట్రం ఏర్పడిందని నొక్కి చెప్పారు.

కాంగ్రెస్ సమాధానం చెప్పాలి...

"ఉద్యమ సమయంలో 1500 మందిని బలి తీసుకున్నందుకు సోనియాని ఆహ్వానించి సన్మానం చేస్తారా? రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ కార్యక్రమమా? లేక మీ పార్టీ కార్యక్రమమా?" ప్రభుత్వ కార్యక్రమం అయితే ఓ పార్టీ నేతని ఎలా ఆహ్వానిస్తారు? ఒకవేళ మీ పార్టీ కార్యక్రమం అయితే గాంధీ భవన్ కి పిలిచి సన్మానం చేసుకోండి.. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతని ఎలా ఆహ్వానిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి" అని కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.

కిషన్ రెడ్డికి కాంగ్రెస్ కౌంటర్

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సంస్కృతి, సంప్రదాయాలకు, మహిళలకు ఇచ్చే గౌరవానికి మీ కామెంట్స్ నిదర్శనం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలకి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రిప్లై ఇచ్చారు.

"తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ. అలాంటి మీరు సోనియా గాంధీ మీద విమర్శలు చేయడం సిగ్గు చేటు. తెలంగాణలో అస్తిత్వం కోసం మీరు సోనియా గాంధీని కించపరిచేలా మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కృతి, సంప్రదాయాలకు, మహిళలకు ఇచ్చే గౌరవానికి మీ కామెంట్స్ నిదర్శనం. బీజేపీ నేతలు ఇప్పటికైనా ఆలోచన తీరు, వ్యవహార శైలి మార్చుకోక పోతే దేశంలో తిరస్కరించబడే స్టేజ్ కి వెళ్తారని తెలుసుకోండి. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సహకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. సోనియా గాంధీ ఏ హోదా లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు అని మాట్లాడుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుంది" అని అద్దంకి దయాకర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఇచ్చారు.

Tags:    

Similar News