హెచ్‌సీయూ వివాదంలో కేంద్రం జోక్యం కోరిన బీజేపీ ఎంపీలు

జీవవైవిద్యంతో ఉన్న ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఎంపీలు వివరించారు.;

Update: 2025-04-01 08:35 GMT

హెచ్‌సీయూ భూముల వివాదం ఢిల్లీకి చేరింది. 400 ఎకరాల భూములను వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చదును చేసే పనులు చేపడుతోంది. వీటిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా ఈ 400 ఎకరాల విషయంలో కాంగ్రెస్ తప్పు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థులను అరెస్ట్‌లు చేయడమే కాకుండా, జీవవైవిద్యానికి హాని కలిగించే గ్రీన్ మర్డర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని అంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ వాయిస్‌ను గట్టిగా వినిపించారు. మంగళవారం హెచ్‌సీయూను సందర్శించాలని ఇరు పార్టీల నాయకులు ప్లాన్ చేసుకున్నారు. కానీ హెచ్‌సీయూ సందర్శన కుదరదని పోలీసులు పేర్కొన్నారు. అంతేకుండా ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ వివాదం ఢిల్లీకి చేరుకుంది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ సహా మిగిలిన ఎంపీలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న గ్రీన్ మర్డర్‌పై దృష్టి సారించాలని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని, హైదరాబాద్ పర్యావరణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు చాలా ప్రయోజనకరమని వివరించారు. ఆ 400 ఎకరాల భూముల్లో 700 రకాల ఔషధ మొక్కలు, 220 జాతుల పక్షులు ఉన్నాయని, ప్రభుత్వం చేపట్టిన పనులతో వన్య ప్రాణులు బెంబేలెత్తిపోతున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రాణుల ఆర్థినాదాలతో ఆ ప్రాంతామంతా అల్లారుతోందని చెప్పారు. జీవవైవిద్యంతో ఉన్న ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని అన్నారు. ఈ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత హెచ్‌సీయూ విద్యార్థులతో పాటు ప్రతి హైదరాబాద్ వాసికి ఉందని అన్నారు. వారంతా కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు.

Tags:    

Similar News