‘తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోంది’.. బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అటవీ నిర్మాణల మాఫియాను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.;
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో గ్రీన్ మర్డర్ విచ్చలవిడిగా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా గ్రీన్ మర్డర్ జరిగిందని.. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని అన్నారు. కాళేశ్వరం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 25 లక్షల చెట్లను నరికేసిందని, ఆ తర్వాత హరితహారం ముసుగులో పర్యావరణానికి హాని చేసే కోనోకార్పరస్ మొక్కలను బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు బండి. ఇప్పుడు ఈ హరిత విధ్వంసంలోకి కాంగ్రెస్ కూడా చేరిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి కాంగ్రెస ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆదివారం రోజున జేసీబీలతో హెచ్‌సీయూలో భూమి చదును పనులు చేయడాన్ని ఆయన ఖండించారు. ‘‘గొడ్డలి అదే.. చేతులు మాత్రమే మారాయి. హరిత విధ్వంసం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ హయాంలో దెబ్బ మరింత లోతుగా తాకింది’’ అని బండి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అటవీ నిర్మాణల మాఫియాను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ‘‘రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వేలం వేయాలని చూస్తున్న స్థలాన్ని ఆనుకుని అనేక రకాల వృక్ష, పక్షి జాతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ పని వల్ల వాటి ఉనికి ప్రమాదంలో పడుతుంది’’ అని బండి సంజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే వర్సిటీ భూముల వేలం పాటను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
విద్యార్థుల అరెస్ట్
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. విద్యార్థులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ భూముల అక్రమ వేలం పాటను నిలిపివేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కాగా ఆదివారం ఆ భూములను జేసీబీల సహాయంతో అధకారులు చదును చేయించడం ప్రారంభించారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. వర్సిటీకి చెందిన 400 ఎకరాలను వేలం వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన చదును పనులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఇందులో భాగంగానే ఈస్ట్ క్యాంపస్ ముందు బారికేడ్‌లు పెట్టారు పోలీసులు. అధికారులు చేయిస్తున్న చదును పనులకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా విద్యార్థుు అటుగా వెల్లి పనులను అడ్డగించాలని చూస్తే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం ఎం చేసినా? ఏం చేసినా? తాము ఆందోళనను విరమించుకోబోమని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.