గోషా మహల్ ‘నవాబ్’ రాజాసింగ్ స్పెషాలిటి ఏంటంటే...

టి. రాజాసింగ్..హైదరాబాద్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ బీజేపీ లీడర్...ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈయన ఈ సారి కమలనాథులపై అలకబూనారు. రాజాసింగ్ రూటే సపరేటు...

By :  Vanaja
Update: 2024-04-04 13:13 GMT

గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ లోథ్ పార్లమెంట్ ఎన్నికల వేళ అలకబూనారు. సాక్షాత్తూ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి అయిన రాజాసింగ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

- ఈ సారి బీజేపీకి వై నాట్ హైదరాబాద్ అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ఈ సారి ఎన్నికల బరిలోకి మహిళా అభ్యర్థి కొంపెల్లి మాధవీలతను దించారు. ఈ సారి హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్న కమలనాథులకు నగరంలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్ ఇచ్చారు.

- పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా నగరం వదిలి మహారాష్ట్రలో ప్రచారానికి వెళుతుండటంతో బీజేపీ నగర నేతలు ఆందోళన చెందుతున్నారు.

- హిందూ ధర్మ రక్షణ, గోమాతల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ పార్లమెంట్ ఎన్నికల వేళ కమలనాథులకు కొరకరాని కొయ్యగా మారారు. నిత్యం వివాదాలకు కేరాప్ గా నిలిచిన ఈయన ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారనేది కమలనాథులను వేధిస్తున్న ప్రశ్న.

- రాజాసింగ్ గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2018, 2023వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి వరుస విజయాలతో రికార్డు సాధించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన రాజాసింగ్ పూర్వీకులు హైదరాబాద్ నగరంలోని గోషామహల్ ప్రాంతంలో స్థిరపడ్డారు.

కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా...

1977వ సంవత్సరం ఏప్రిల్ 15వతేదీన జన్మించిన రాజాసింగ్ 2009వ సంవత్సరంలో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 2009 సంవత్సరంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటరుగా గెలిచారు. అనంతరం బీజేపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ గౌడ్ పై 46,793 ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2018 ఎన్నికల్లో రెండోసారి గెలిచి పబ్లిక్ అంచనాల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు.ప్రొటెం స్పీకరు అయిన మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనని ప్రకటించిన రాజాసింగ్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకరుగా ఎన్నికయ్యాక డిసెంబర్ 14వతేదీన ఆయన ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జీగా రాజాసింగ్ ను ఆ పార్టీ ఈ ఏడాది జనవరి 8వతేదీన నియమించింది.

ఎన్నెన్నో కేసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. జుమెరాత్ బజార్ లో స్వతంత్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్ విగ్రహాన్ని తొలగించడంతో రాజాసింగ్ పై పోలీసు కేసు పెట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.హింసను ప్రేరేపించేలా రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో నియమావళిని ఉల్లంఘించారని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై నిషేధం విధించారు.

రాజా‌సింగ్‌ను శాంతింపజేసేందుకు బీజేపీ నేతల యత్నాలు

రాజాసింగ్ మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్ కు సన్నిహితుడు. బీజేపీ రాజాసింగ్ పై గతంలో విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయించడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు బీజేపీ ప్రస్థుత రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డితో విభేదాల కారణంగా రాజాసింగ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి కూడా రాజాసింగ్ డుమ్మా కొట్టారు. దీంతో రాజా సింగ్‌ను శాంతింపజేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ బీజేపీ లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి తాజాగా రాజా సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవి లతకు మద్దతు ఇవ్వాలని వీరు కోరినట్లు సమాచారం. దీనిపై రాజాసింగ్ పలు సమస్యలు ప్రస్థావించారని సమాచారం.

అలకకు కారణాలు...

ముందుగా హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి హిందూ బ్రాండ్ ఉన్న రాజాసింగ్ ను రంగంలోకి దించాలని బీజేపీ యోచించింది. ఆపై అనూహ్యంగా మాధవీలతను తెరమీదకు తీసుకువచ్చి టికెట్ ఖరారు చేశారు. గతంలోనే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేసిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చిన మహేశ్వర్ రెడ్డికి శాసనసభ పక్ష నాయకత్వ పగ్గాలు అప్పగించడంతో ఆయన అలకబూనారని సమాచారం. దీనికి భాష సమస్యతోపాటు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ కు బీజేపీ లెజిస్లేచర్ పగ్గాలు అప్పగించరాదని కొందరు నేతలు కోరారని అంటున్నారు. తనకు అవమానించారని రాజాసింగ్ చెప్పడంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని పార్టీ ఇన్ చార్జి పాటిల్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయాలని పాటిల్ కోరారు. నేతల భేటీతో రాజాసింగ్ ప్రచార బరిలో దిగుతారా ? లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

వివాదాస్పద వీడియో బాగోతం

2022వ సంవత్సరం ఆగస్టు 22వతేదీన సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను పెట్టారు. ఈ వీడియోపై మజ్లిస్ పార్టీతోపాటు ముస్లింలు తీవ్ర ఆందోళన చేశారు. ఈ వీడియోపై రాజాసింగ్ పై ఫిర్యాదు చేయడంతో అతనిపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు పెట్టి అతన్ని ఆగస్టు 23వతేదీన అరెస్ట్ చేశారు. అయితే నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిలు ఇచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్ పై పీడీయాక్ట్ పెట్టి మళ్లీ ఆగస్టు 23వతేదీన అరెస్ట్ చేశారు. అలిపిరి వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల చిత్రపటాలను తొలగిస్తున్నారని, దీనిపై బాయికాట్ తిరుపతి అంటూ రాజాసింగ్ పిలుపు ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు టి రాజాసింగ్ ను 2021 ఆగస్టు 23వతేదీన బీజేపీ అధిష్ఠానవర్గం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

మహారాష్ట్రలోనూ కేసులు

గతంలో మహారాష్ట్రలోని షోలాపూర్ నగరంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని అక్కడి పోలీసులు ఇతనిపై కేసు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వతేదీన మహారాష్ట్రలోని థానే నగరంలో హిందూ జన్ ఆక్రోశ్ మోర్చా ర్యాలీలో పాల్గొన్న రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసి రామమందిరం నిర్మించినట్లు కాశీ, మధురలలో కూడా పునరావృతం చేయాలని రాజాసింగ్ ర్యాలీలో పిలుపునిచ్చారు.

పార్టీ లైన్ దాటి ప్రవర్తించనని బీజేపీకి రాజాసింగ్ వివరణ

తనది హిందూ రక్తమేనని, తాను బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, పార్టీ లైన్ తాను ఎన్నడూ దాటలేదని రాజాసింగ్ వివరణ ఇచ్చారు. హిందువులకు సే చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానవర్గాన్ని అభ్యర్థించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు 22వతేదీన రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓంపాఠక్ ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్ ఎత్తివేత అనంతరం గోషామహల్ తన సిట్టింగ్ అసెంబ్లీ స్థానం నుంచి రాజాసింగ్ మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేతకు బండి సంజయ్ కీలకపాత్ర వహించారని సమాచారం. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి రాజాసింగ్ తో పార్టీకి వివరణ ఇప్పించిన బండి సంజయ్ ఆపై సస్పెన్షన్ ఎత్తివేయించారు. గతంలోనే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేసిన రాజాసింగ్ కు మూడోసారి ఎమ్మెల్యే అయ్యాక ఫ్లోర్ లీడర్ పదవి దక్కలేదు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో బీజేపీ శాసనసభా పక్ష పదవి పోయింది. కేంద్ర పార్టీ నేతల చొరవతో రాజాసింగ్ అలక వీడతారా? లేదా అనేది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News