‘బీఆర్ఎస్ హయాంలో భారీ బియ్యం స్కాం జరిగింది’
ఆరు గ్యారెంటీల తో పాటు ప్రజలకు లబ్ధి చేకూరే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ రాహుల్ గాంధీ అని మహేష్ పేర్కొన్నారు.;
పేదవాడు తినడానికి వీలుగా ఉండేలా రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. కాగా ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్నబియ్యం గురించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. అసలు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకం గురించి మాట్లాడే అర్హత కూడా బీఆర్ఎస్‌కు లేదన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్, కేటీఆర్‌లు పగటి కలలు కంటున్నారని, ఇప్పటికయినా పగటికలలు మానుకుని రియాల్టీని చూడటం నేర్చుకుంటే వాళ్లకే మంచిదంటూ హితవు పలికారు.
‘‘కాంగ్రెస్ అభివృద్ధి చూసిని బిఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. బిఆర్ఎస్ హయంలో కేసిఆర్ ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ స్కాం జరిగింది. సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బిఆర్ఎస్ నేతలకు లేదు. కేసిఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం గా మార్చి ఎగుమతి చేసిన విషయం మరిచిపోయారా? 15 మాసాల్లో ప్రజాపాలన మార్పు చూపించగలిగాం. ప్రజల ఆకాంక్షలు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. ఉచిత బస్సు నుంచీ సన్న బియ్యం వరకు పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్న బియ్యం పంపిణీ చేపట్టింది’’ అని తెలిపారు.
‘‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణకు మోక్షంతో జీవో విడుదల చేశాం. ధరణి తో విసిగి వేసారిన ప్రజలకు భూభారతి తో మోక్షం. ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి. ఆరు గ్యారెంటీల తో పాటు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ రాహుల్ గాంధీ. రేపు సిఎల్పీ సమావేశం నోవేటెల్ లో జరగనుంది. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలపై చర్చ ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ,కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తిగతం. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకు కొదవలేదు. కేసిఆర్ కుటుంబం ఆర్ధిక దోపిడీ చూసి భయపడి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. కేటీఆర్ అరెస్టు కావాల్సిందే. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని వ్యాఖ్యానించారు.