యాదాద్రి పవర్ ప్లాంట్ పై అధికారులకు డెడ్ లైన్

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం అధికారులకు డెడ్ లైన్ విధించింది.

By :  Vanaja
Update: 2024-08-04 14:43 GMT

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం అధికారులకు డెడ్ లైన్ విధించింది. వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను ఆయన ఆదేశించారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన జెన్కో ఉన్నతాధికారులతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి యూనిట్ అక్టోబర్ 30 కల్లా, రెండో యూనిట్ అక్టోబర్ 15 కల్లా, మూడో యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, నాలుగో యూనిట్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి, 5వ యూనిట్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్లాంట్లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారని, ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్టు సమావేశంలో జెన్కో అధికారులు వివరించారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానం వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయండి, దోమల బారి నుంచి అధికారులు, సిబ్బందిని కాపాడేందుకు నిద్రించే క్యాంపుల్లో దోమతెరలు సరఫరా చేయండి, పని ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేయించాలన్నారు. అధికారులు, కార్మికుల భద్రతకు ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడవద్దని భట్టి తెలిపారు. అధికారులు, కార్మికులు స్థానికంగా నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని భట్టి చెప్పారు.యాదాద్రి పవర్ ప్లాంట్ పై అధికారులకు డెడ్ లైన్

స్థానికంగా నివసించేందుకు ఇబ్బందులు ఉన్నందున క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ, దామరచర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేయాలని భట్టి కోరారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపునకు తాళ్ల వీరప్పగూడెం, దామరచర్లకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆగస్టు మాసంలో తాను ప్లాంటును సందర్శించి, అధికారులు, సిబ్బందితో భేటీ అవుతానని తెలిపారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రాస్, జన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News