తెలంగాణలో యుద్ధం మొదలైంది.. మహా ఎన్నికల ఫలితాలపై బండి

మహారాష్ట్రలో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మహాయుతి కూటమి ఏర్పాట్లు ప్రారంభించేసింది.

Update: 2024-11-23 07:21 GMT

మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Elections) భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మహాయుతి కూటమి ఏర్పాట్లు ప్రారంభించేసింది. ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తుండటమే ఇందుకు కారణం. మహారాష్ట్రలో మరోసారి మహాయుతి చక్రం తిప్పనుందని కూటమి పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ వైఫల్యాలే కారణమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్(Congress) వైఫల్యాలను చూసే మహారాష్ట్ర ప్రజలు వారికి ఓటు వేయలేదన్నారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ అనేది ఐరన్ లెగ్ పార్టీ అని తేటతెల్లమయిందంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం ఎన్‌డీఏ(NDA) కూటమినే నమ్మారని, మోదీ(Modi)తోనే వారి నిలబడ్డారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ(BJP) ఎంటరిగా 125 స్థానాలు గెలవనుందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపనున్నాయన్నారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని పేర్కొన్నారు.

‘‘మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువు అయ్యింది. బిజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుంది. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉంది. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమి నే మహారాష్ట్ర ప్రజలు నమ్మారు. మహారాష్ట్ర లో హిందూ సమాజం ‌ఐకమత్యాన్ని చాటారు. బటేంగే తో కటెంగే అని చాటారు. సమాజం ఐక్యంగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి. కర్ణాటక, తెలంగాణ నుండి మహారాష్ట్రకు కాంగ్రెస్ డబ్బులు పంపింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని‌ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోడి‌ అభివృద్ధి మంత్రం పనిచేసింది. బూతులకి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న మా కార్యకర్తల ముందు పనిచేయలేదు. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు.

‘‘తెలంగాణ లో కూడా కాంగ్రెస్ కి ఇదే గతి పడుతుంది. మహారాష్ట్ర లో కాంగ్రెస్ ‌పార్టీ మోసాలని మేము ప్రచారం చేసాం. ఇప్పటికైనా తెలంగాణ లో‌ ఇచ్చిన హామీ నెరవెర్చండి..లేదంటే మహారాష్ట్ర లో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు..చెప్పింది‌ మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ చేశారా. మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణలో ప్రభావం చూపుతుంది. తెలంగాణ లో యుద్ధం ప్రారంభం అయ్యింది. ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం కూలాలని మేము అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులలో ప్రభుత్వం పై అసంతృప్తి ఉంది. కులగణన ఫాం పెన్సిల్ తో నింపి మార్చే అవకాశం ఉంది. కులగణన లో భయపెట్టి సర్వే చేస్తున్నారు’’ అని తెలిపారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా నడుస్తోంది. 220 స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. వీటిలో బీజేపీ ఒంటరిగా 128 స్థానాల్లో ముందంజలో నిలిచింది. బీజేపీ మొత్తంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. 53 స్థానాల్లో ఏక్ నాథ్ షిండే శివసేన ముందంజలో ఉంది. 36 స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ ఆధిక్యం కనబరుస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 19 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్‌సీపీ 13 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

Tags:    

Similar News