Bandi Sanjay | ‘కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే ఊరుకునేది లేదు’
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమొచ్చిన పేర్లు పెడతామంటూ ఊరుకునేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.;
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమొచ్చిన పేర్లు పెడతామంటూ ఊరుకునేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అవే పేర్లు ఉంచాలని అన్నారు. పేర్లు మార్చుకుంటే మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర పథకాలకు రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంటే పథకాలు ఇవ్వకుండా ఆపేస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ అంశంపై మరోసారి ఆయన తీవ్రంగా స్పందించారు. పేదవారికి ఇళ్లు ఇవ్వడం కోసం కేంద్రం నిధులు ఇస్తుంటే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారు? అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా కేంద్రం ఇచ్చే రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం ఫొటో ఎలా పెడుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు పేదలకు ఇళ్లు ఇవ్వడం కోసం కాకుండా పథకాలకు తమ పార్టీ నేతల పేర్లు పెట్టుకోవడానికే ఎక్కువ పాకులాడుతుందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇస్తామన్న ఆరు గ్యారెంటీలకు ఇప్పటి వరకు గతి లేదని, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేంద్ర పథకాల పేర్లు మార్చి తాము ఇస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
‘‘పేర్లు మార్చాలనుకుంటే మాత్రం.....ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుంది. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ మేం అన్యాయం చేయబోం. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా. గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు?’’ అని ప్రశ్నించారు.
ఎవరి పేరు పెట్టుకున్నా పట్టించుకోం
‘‘రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివ్రుద్ధిపై చిత్తశుద్ధి లేదు. అభివ్రుద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసింది. గ్రామాల్లో జరిగిన అభివృద్ది అంతా కేంద్ర నిధులతోనే జరిగింది. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే’’ అని తెలిపారు.
ప్రజల సొమ్మే కదా..!
‘‘6 గ్యారంటీలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేనేలేదు. మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంది? మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేయలేదా? రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచం. కాంగ్రెస్ నేతల జేబుల నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్..బంగ్లాదేశ్ నుండి తెచ్చి ఖర్చు చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా?’’ అని దుయ్యబట్టారు. గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే... కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా? డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్బంగానే గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గద్దర్‌కు అవార్డు ఇవ్వం..
‘‘పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు... రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలి. గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం... ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా? వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే... నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్. తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో... ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైంది’’ అని వ్యాఖ్యానించారు.