Bandi Sanjay | ‘ఒక్క సీఎం కూడా మాట నిలబెట్టుకోలేదు’

తెలంగాణకు ఇద్దరు సీఎం బాధ్యతలు నిర్వహించగా ఇద్దరూ కూడా ప్రజలకు ముంచినవారే అంటూ మండిపడ్డారు బండి సంజయ్.;

Update: 2025-01-29 10:20 GMT

తెలంగాణ రాష్ట్ర సీఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సీఎంగా వ్యవహరించిన ఏ సీఎం కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు తెలంగాణకు ఇద్దరు సీఎం బాధ్యతలు నిర్వహించగా ఇద్దరూ కూడా ప్రజలకు ముంచినవారే అంటూ మండిపడ్డారు. ఆయా ప్రభుత్వాలు కూడా అన్నదాతలను, నిరుద్యోగులను ఇలా ప్రతి ఒక్కరినీ దోచుకోవడమే పరమావధిగా పనిచేశాయే తప్ప.. అభివృద్ధి అన్న ఆలోచన కూడా చేయలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్తుంది కానీ.. అర్హులందరికీ పథకాలను మాత్రం అందించడం లేదని విమర్శించారు.

రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణలో 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడం ఏంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులుంటే ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో డబ్బులే పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే 9,80,000 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటని నిలదీశారు.

‘‘రాష్ట్రంలో 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు కేవలం 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనవి అయినప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటు. ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా.. నయాపైసా ఖర్చు చేయకపోవడం దారుణం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రే ఇచ్చిన హామీలను అమలు చేయలేకుంటే.. మీ నేతృత్వంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీతనంతో పనిచేయగలరు? ఆరు గ్యారెంటీలకు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇకనైనా అరహులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్లను అందించాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News