Bandi Sanjay | ‘ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం’
ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల అంశంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.;
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ‘ఇందిరమ్మ ఇళ్లు’. ఇప్పటికే ఈ పథకం కింద అర్హుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే తాజాగా ఈ పథకంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ‘ఇందిరమ్మ’ ట్యాగ్ పెడుతున్నారంటూ మండిపడ్డారు. దీనిని తాము ఏమాత్రం సహించమన్నారు. అదే విధంగా తెలంగాణలో అందించనున్న కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ ఫొటోతో పాటు ప్రధాని మోదీ ఫొటో కూడా ముద్రించాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో లేకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అదే విధంగా రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో లేకపోతే దేశంలోని పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామంటూ హెచ్చరించారు. అదే జరిగితే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని, కేంద్రం అందించే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లు పెట్టుకోవడం ఏమాత్రం సబబు కాదంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదే. కేంద్రం నుంచి నిధులు తెచ్చినా పదేళ్లు పాలన చేసిన బీఆర్ఎస్ ఒక్కసారి కూడా నన్ను పిలవలేదు. స్మార్ట్ సిీ ప్రాజెక్టుకు నేను నిధులు తీసుకొస్తే వాళ్లు పనులు ప్రారంభించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నిధులను దారిమళ్లిస్తే కొట్లాడి మరీ అడ్డుకున్నాను. కరీంనగర్ కోసం ఎంత కష్టపడినప్పటికీ నన్ను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా దూరం పెట్టారు. మోదీ ప్రభుత్వం అందించిన నిధులతోనే కరీంనగర్‌లో అభివృద్ధి జరిగిందని ప్రజలకు అర్థమయింది. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయింది. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ కూడా నడుస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందిస్తున్న పథకానికి ఇక్కడ ఇందిరమ్మ ట్యాగ్ ఇస్తున్నారు. అది ఆపకపోతే తీవ్రంగా పరిగణిస్తాం. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం. నేరుగా కేంద్రం నుంచే పేదలకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకునే ఆలోచన చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే పథకాలకు సొంత పేర్లు పెట్టేసి వీరేందో ఇచ్చేస్తున్నట్లు చెప్పుకోవడం అలవాటైపోయింది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు బండి.