హైడ్రా పేరుతో బెదిరించేవారికి రంగనాథ్ వార్నింగ్

హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

By :  Vanaja
Update: 2024-09-04 11:06 GMT

హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు హైడ్రా పేరు చెప్పి బిల్డర్ల వద్ద మోసపూరితంగా డబ్బులు వసూలు చేసేందుకు పథకాలు రచిస్తున్నారు. తాజాగా అమీన్పూర్ లో హైడ్రా పేరుతో బిల్డర్ల ను బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. బెదిరింపులకు పాల్పడేవారికి వార్నింగ్ ఇచ్చారు.

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్న ఓ వ్యక్తి వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని వెల్లడించారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ... డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో గానీ, ఏసీబీకి గానీ ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

రంగనాథ్ దగ్గరివాడంటూ బ్లాక్ మెయిల్...

హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీఓఆర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీని నిర్మిస్తున్న బిల్డర్లను హైడ్రా పేరు చెప్పి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి తమను డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో తనకి దగ్గర పరిచయం ఉందని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ విప్లవ సిన్హా అనే వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు.

పిస్తా హౌస్ వద్ద కలుద్దాం అని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసిన దిగిన ఫోటోలు చూపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగనాథ్ తనకు బాగా దగ్గరని, అమీన్పూర్ లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతాడని చెప్పి బెదిరింపులకు పాల్పడినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. "హైడ్రా నిర్మాణం జోలికి రావద్దంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే హైడ్రానందు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తా" అంటూ బెదిరింపులకు గురి చేశాడని బిల్డర్లు సదరు వ్యక్తిపై అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డర్ల ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News