లగచర్లలో కలెక్టరుపై దాడి బిఆర్ఎస్ కుట్రనే : భట్టి విక్రమార్క

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తలకిందులు తపస్సు చేసిన ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Update: 2024-11-13 13:14 GMT

లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.లగచర్లలో కలెక్టరుపై దాడి బిఆర్ఎస్ కుట్రనే అని ఆయన ఆరోపించారు.కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ నాయకులు ఒప్పందం చేసుకున్నారని ఆయన చెప్పారు.‘‘ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి’’ అని భట్టి చెప్పారు.


బీఆర్ఎస్ కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారంగా అరాచక శక్తులతో దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవోలపై దాడి చేయించారని డిప్యూటీ సీఎం చెప్పారు.లగచర్లలో కలెక్టర్ దాడి వెనుక కాల్ డేటా తీయగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు.లగచర్లలో కలెక్టర్, ఇతర ఉన్నత స్థాయి అధికారులపై జరిగిన దాడిని ప్రజా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

పమస్యలుంటే చెప్పండి
ఏదైనా సమస్య ఉన్నప్పుడు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులతో చర్చించడం, న్యాయస్థానాలకు వెళ్లడం ఇవన్నీ అవకాశాలు ఉండగా కుట్రపూరితంగా బీఆర్ఎస్ నాయకులు అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమని డిప్యూటీ సీఎం చెప్పారు. ‘‘రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు అభివృద్ధి జరగొద్దు అనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరించడం మంచిది కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ కోసం భూసేకరణ చేసిన సమయంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన గొంతెత్తినం, అధికారులను కలిశాం, న్యాయస్థానానికి వెళ్లాం, పత్రికల ద్వారా మా నిరసనను తెలియజేశామే తప్ప ఏనాడు ఇలా దాడులకు తెగబడలేదు’’అని భట్టి చెప్పారు.

కొడంగల్ అభివృద్ధి కోసమే...
అత్యంత వెనుకబడి ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా పారిశ్రామికీకరణ అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.రైతుల బాధను ఇందిరమ్మ రాజ్యం సంపూర్ణంగా అర్థం చేసుకుంటుందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే ప్రజా ప్రభుత్వం ఉద్దేశమని భట్టి చెప్పారు.అందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్- ఔటర్ రింగ్ రోడ్ మధ్యన పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో ఒప్పందం కుదిరిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయమని కేటీఆర్ చెప్పారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు


Tags:    

Similar News