అమ్మవారికి అవమానం.. పక్కా ప్లాన్‌తోనే దుశ్చర్య

దసరా పండగ వేళ అమ్మవారికి తీవ్ర అవమానం జరిగింది. పండగ వేడుకల కోసమని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Update: 2024-10-11 06:56 GMT

దసరా పండగ వేళ అమ్మవారికి తీవ్ర అవమానం జరిగింది. పండగ వేడుకల కోసమని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దసరా దగ్గర పడుతున్న క్రమంలో అక్కడ భారీ కార్యక్రమం నిర్వహించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అపచారం.. అమ్మవారికి అవమానం జరిగాయి. అర్థరాత్రి సమయంలో అమ్మవారి విగ్రహంపై దాడి చేసి విగ్రహం కాళ్లు, చేతులు పగులగొట్టేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు దుండగులు. ఈ విషయాన్ని ఉదయం గమనించిన స్థానికులు వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే నిర్వాహకులతో పాటు హిందూ సంఘాలు కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

దాడి ప్లాన్ ఇలా..

పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న దుండగులు.. అర్థరాత్రి సమయంలో ముందుగా విద్యుత్‌ సరఫరాను కట్ చేశారు. అనంతరం అక్కడ అమర్చిన సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని విరగొట్టారు. అక్కడ ఉన్న పూజా సామాగ్రిని కూడా చెల్లాచెదురుగా పడేశారు. అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను సైతం తొలగించేశారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని, బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని స్థానికులు, నిర్వాహకులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. హిందువుల అంటే చులకనై పోయారా అంటూ మండిపడుతున్నారు.

ఇది హిందూ దేశమేనా..

ఈ సందర్భంగానే ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట హిందూ ఆలయాలపై, హిందూ దేవతల విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఇతర దేశాలకే పరిమితమైన ఈ దాడులు ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో జరగడం దారుణమని, ఇవి చూస్తుంటే ఇది హిందూ దేశమేనా? లేకుంటే మరే ఇతర మతాలను విశ్వసించే దేశమా? అన్న అనుమానాలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇటువంటి ఘటనలకు మరెక్కడా పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

విధ్వంసం జరిగిందెప్పుడు..

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దాండియా కార్యక్రమం నిర్వహించారు. ఇది పూర్తయ్యే వరకు పోలీసులు అక్కడ విధులు నిర్వహించారు. కానీ తెల్లారేసరికి అమ్మవారి విగ్రహంపై దాడి జరగడంతో ఈ దాడి అర్ధరాత్రి సమయంలోనైనా జరిగి ఉండాలి, లేకుంటే తెల్లవారుజామునైనా జరిగి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులను గుర్తించడం కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు.

ఇదంతా డైవర్షన్ కోసమేనా..

అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిన ఘటనకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారు కొందరు. హైడ్రా, మూసీ సహా ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి మరెన్నో అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ఈ దాడి ఘటన కూడా అందులోని భాగమేనని ఆరోపణలు తెగ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మాదిగల వ్యతిరేకతను సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సి ఉందన్న మందకృష్ణ మాదిగ మాటలతో.. వారి దృష్టిని నోటిఫికేషన్లపై నుంచి తప్పించడం కోసం సీఎం రేవంతే తన అనుయాయువలతో ఈ పని చేయించి రాష్ట్రంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఘటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News