తప్పని తెలిసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడుతున్నారా?

తెలిసి ఊబిలోకి దిగేవారు ఎక్కువ, తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే అత్యాశ;

Update: 2025-08-21 07:46 GMT

న్యూస్ పేపర్ తెరిస్తే ఆన్ లైన్ గేమింగ్ బీభత్సరం కనిపిస్తుంది. ఆన్ లైన్ గేమింగ్ లో డబ్బులు కోల్పోయి వారు హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

1. నాలుగు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
2 ఆన్‌లైన్‌ జూదంలో తాను లక్షల్లో డబ్బు కోల్పోయినందుకు స్నేహితుడే కారణం అని అతడిని నిర్ధాక్షిణ్యంగా చంపాడో యువకుడు. ఈ మేరకు ఈ నెల 12న రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటనకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు.
3.ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కి అలవాటు పడి అప్పులు తీర్చలేక ఓ పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బెట్టింగ్ గేమ్స్ ని ఆడకుండా ఉండలేక... అప్పులు తీర్చలేక ప్రాణాలను తీసుకుంటున్నానని మృతుడు....సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
ఇవి ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ వల్ల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ ఆన్ లైన్ గేమింగ్ కు మహిళలు కూడా బానిసలా మారడం అందరిని కలవరపరుస్తోంది.
కొన్ని రోజుల క్రితం మహిళా పొదుపు సంఘంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఓ యువతి పొదుపు సంఘంలోని నెలవారీ మొత్తం డబ్బులతో పాటు వివిధ పేర్లతో అప్పు తీసుకుని ఆన్ లైన్ లో బెట్టింగ్ పెట్టి పొగొట్టుకుంది.
ఇవే కాకుండా సొంత ఆస్తి పది గుంటలు సైతం అమ్మి ఆన్ లైన్ గేమింగ్ లో పెట్టింది. అవి కూడా పూర్తిగా నష్టపోయింది. పొదుపు సంఘం వాళ్లు వచ్చి లెక్కలు చూస్తారని అనుమానం వచ్చి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది.
చట్ట విరుద్ధమని తెలుసు కానీ..
ఆన్ లైన్ గేమింగ్ యాప్ ఆడటం, బెట్టింగ్ వేయడం చట్టవిరుద్దమని తెలంగాణలో చాలా మంది ప్రజలకు తెలుసని ఈ మధ్య ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
‘ఫోర్సెస్సెస్ డ్రైవింగ్ ఆన్ లైన్ బెట్టింగ్ అండ్ గ్యాబ్లింగ్ ఇన్ తెలంగాణ’ పేరుతో ఈ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న 96 శాతం మంది ప్రజలు తమకు బెట్టింగ్ చేయడం నేరమనే విషయం తెలుసని చెప్పారు.
అయినప్పటికీ 87 శాతం మంది ప్రజలు రోజు తాము ఆన్ గేమ్ ఆడుతున్నట్లు ఇందులో అంగీకరించడం ఆందోళన కలిగిస్తోంది.
డబ్బు సంపాదించాలనే అత్యాశ..
ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆన్ లైన్ గేమ్ ఆడే వారిలో దాదాపు 97 శాతం మంది త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఆడుతున్నారు.
చెమట పట్టకుండా కోటీశ్వరుడు కావాలనే తపనే వారిని తప్పుడు మార్గంలోకి నడిపిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారు పరోక్షంగా అంగీకరించారు. ఇది అందరిని దిగ్భ్రాంతిని కలిగించే అంశం.
ఈ గేమింగ్ కంపెనీల వల్ల ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది దాదాపు 20 వేల కోట్ల మేర నష్టపోతున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇవే కాకుండా వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదు కాకుండా ఉండి ఉంటాయనే అనుమానాలు సైతం ఉన్నాయి.
తెలంగాణలో నిషేధం..
తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్ పై 2017 లోనే నిషేధం విధించారు. ఈ నిషేధం స్వదేశంలో బెట్టింగ్ యాప్ లు నిర్వహించే వాటికి కళ్లెం వేసింది. అయినప్పటికీ ఆఫ్ షోర్ ఆన్ లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో ప్లాట్ ఫాం లు మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా విదేశీ సంస్థలకు చెందినవే.
డిజిటల్ మార్కెటింగ్, సెలబ్రిటీ ఎండార్స్ మెంట్లు, ఎన్ క్రిప్టెడ్ ప్లాట్ ఫాంల ద్వారా వినియోగదారులను నేరుగా సంప్రదించి ముగ్గులోకి దింపుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్లు చేసి కేసులు ఎదుర్కొంటున్నారు.
చాలామంది సెలబ్రిటీలకి దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చి విచారించాయి. వారంతా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ మధ్య ఓ సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ చేస్తున్న బెటింగ్ యాప్ ప్రమోషన్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో అందరి దృష్టి వీళ్లపై పడింది.
ఆన్ లైన్ ప్రకటనలు, యూట్యూబ్ వీడియోలు, టెలిగ్రామ్ గ్రూపులు, మీమ్ పేజీలను సైతం ఉపయోగించుకుంటున్న బెట్టింగ్ యాప్ లు ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ ప్లూయనర్స్ కు కూడా పెద్ద మొత్తంలో ముట్టజెపుతున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాము ఫలానా ఆన్ లైన్ గేమ్ లో లక్షలు సంపాదించామనే కోతల రాయుడిల మాటలు విని ఇందులో దిగినట్లు చాలా మంది సర్వే లో చెప్పారు. కనీసం అది నిజమో కాదో అని కూడా ఆలోచించలేదు.
ఈ ఊబిలో దిగాక అందులో నుంచి బయటకు రాలేక విలవిలాడిపోతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై కేంద్ర ప్రభుత్వానికి వందలాది ఫిర్యాదు రావడంతో ‘‘ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యూలేషన్ బిల్లు-2025’’ ను బుధవారం కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టి మూజూవాణీ ఓటుతో ఆమోదింపజేసుకుంది.
కటకటాల్లోకే..
ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఈ స్పోర్ట్స్, ఆన్ లైన్ సోషల్ గేమింగ్ ను ప్రొత్సహిస్తునే, ఏ రూపంలోనైనా డబ్బుతో ఆడే గేమింగ్ ను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ బిల్లు కింద సంబంధిత చర్యను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనల ప్రకారం.. ఆన్ లైన్ మనీ గేమింగ్ ప్రొత్సహించే ఏ వ్యక్తికి అయినా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా కోటీ జరిమానా లేదా రెండు విధిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రకటనలు ఇచ్చే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లేదా రూ. 50 లక్షల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది.
అయితే చాలా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేవలం వినోదం ముసుగున ఈ దందా నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. వారు ఈ బిల్లు ప్రకారం శిక్షకు గురికారు. అయితే బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు తెలియగానే చట్టపరిధిలోకి వస్తాయి.
ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఆన్ లైన్ గేమింగ్ ను నియంత్రించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే నేరస్థులు ఎప్పటికప్పుడూ కొత్త ఎత్తులు వేస్తూ వీటి నుంచి తప్పించుకుంటున్నారు.
ప్రభుత్వ జీఎస్టీ విధించడం ద్వారా అరికట్టడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇక ఆన్ లైన్ గేమింగ్ ఆప్ ఆగడాను ఉపేక్షించి లాభం లేదని అనుకున్న ప్రభుత్వం చట్టబద్దంగా వీటిని శిక్షించడానికి నిశ్చయించుకుంది.
Tags:    

Similar News