Ponguleti Srinivas | ‘పేదవాడి సొంతింటి కల సాకారమయ్యే వేళొచ్చింది’
తెలంగాణ రాష్ట్రంలోని పేదోళ్ల సొంతింటి కల అతి త్వరోనే సాకారం కానుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని పేదోళ్ల సొంతింటి కల అతి త్వరోనే సాకారం కానుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం(Indiramma Illu Scheme) లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందిస్తున్న యాప్ పూర్తయిందని వెల్లడించారు. 5వ తేదీ డిసెంబర్న ఈ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించనున్నారని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచే పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని అన్నారు మంత్రి. అంతేకాకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో నీడలేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని ఆయన వివరించారు.
ఈ పథకం అమలుకు ఉన్న అవరోధాలను అధిగమిస్తూ అమలుకు అవసరమైన కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారాయన. “ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ పేటెంట్. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, ఏ తండాకు పోయినా, ఏమారుమూల ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇళ్ళే కనబడతాయి. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతు. మేం గర్వంగా చెబుతున్నాం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాం’’ అని చెప్పారు.
‘‘లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించాం. ఈ యాప్‌ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గురువారం నాడు ఆవిష్కరించనున్నారు. లబ్దిదారుల ఆర్థిక మరియు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు వంటి అంశాలు ఈ యాప్ లో ప్రధానంగా ఉండనున్నాయి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను ఏర్పాటు చేశాం’’ అని వివరించారు.
మధ్యవర్తి ప్రమేయం లేకుండానే
‘‘దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మహిళ పేరు మీద ఇల్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇళ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంటగది, టాయిలెట్ సౌకర్యాలను కలిగి ఉంటాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్ధ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్ధను రద్దుచేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నాం. లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడతాము’’ అని చెప్పారు.
5 లక్షల ఇళ్లు మా టార్గెట్
‘‘ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నాలుగు సంవత్సరాలలో దశల వారీగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంది. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది మా ప్రభుత్వం. మొదటి విడతలో నివాస స్ధలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్ధలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మాచారులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం’’ అని అన్నారు.
హౌసింగ్ శాఖ పునరుద్దరణ
‘‘పేదలకు ఇళ్లు నిర్మించే హౌసింగ్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలలో విలీనం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖను పునరుద్ధరించి లబ్దిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం, పర్యవేక్షణ వరకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంది. 296 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో 2006-2007లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించింది. తెలంగాణ ప్రాంతంలో 2006-2007 నుంచి 2014 వరకు 23,85,188 ఇళ్లను మంజూరు చేయగా 19,32,001 ఇళ్లను పూర్తి చేసింది. 4,53,187 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసింది” అని పొంగులేటి తెలిపారు.