రేవంత్ కు రెండో దెబ్బ, దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది...
నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. కానీ ప్రజలు మాత్రం వెనక్కు తగ్గలేదు. తమకు కలెక్టర్ మాటలపై నమ్మకం లేదని, ఆయన గతంలో కూడా పలుసార్లు ఇలానే చెప్పినా ఫ్యాక్టరీ పనులను యథేచ్చగా సాగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. తాము నిరసన విరమించుకోవాలంటే కలెక్టర్ రాతపూర్వక ఆదేశాలు ఇవ్వాలని, వాటిని చూసిన రూఢీ చేసుకున్నాకే నిరసన విరమిస్తామని, లేని పక్షంలో తమ ఆందోళన ఆగదని తేల్చి చెప్పారు.
దీంతో చేసేదేమీ లేక.. కలెక్టర్ అభినవ్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని ప్రకటించారు. దాంతో పాటుగా ఐదుగురు రైతులను చర్చలకు రావాలని కూడా కలెక్టర్ ఆహ్వానించారు. తాజాగా ఈ అంశంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టే బాధ్యత తమదని ప్రభుత్వ హామీ ఇచ్చింది. అంతేకాకుండా తక్షణమే ఈ విషయంపై దృష్టి సారిస్తామని, ఇథనాల్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షిస్తామని వెల్లడించింది.
ఇబ్బందిలేకుండా చర్యలు ఉంటాయి
‘‘ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వానికి ముఖ్యం. పరిశ్రమలు కూడా ముఖ్యమైనా ప్రజలకు ఇబ్బంది పెట్టే మూల్యానికి కాదు’’ అని ప్రభుత్వ వర్గాలు స్పస్టం చేశాయి. ఇదే విషయాన్ని కలెక్టర్ అభినవ్ కూడా ప్రజలకు తెలిపారు.
పరుగుల మందుతో నిరసన
ఇథనాల్ ఫ్యాక్టరీ పనులకు వ్యతిరేకంగా దిలావర్పూర్ ప్రజలు రెండు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి వీటిని ఉధృతంగా సాగిస్తున్నారు. రాత్రి సమయంలో రోడ్లపైనే మంటలు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. బుధవారం రోజున పలువురు మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు కొందరిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉధ్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు వాహనాలపైకి గ్రామస్తులు రాళ్లురువ్వారు. దీంతో కలెక్టర్ అక్కడకు చేరుకుని నిరసనలకారులను హామీ ఇచ్చి, వారి కోరిక మేరకు అధికారిక నోటీసులు జారీ చేసి నిరసనలను విరమించుకునేలా చేశారు.