ప్రణీత్ హనుమంతు పూర్తిగా ఇరుక్కున్నాడా?
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది.
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో పోలీసులు ఈసారి అతడిపై డ్రగ్స్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడలోని సెంట్రల్ జైలులో ఉన్న ప్రణీత్ హనుమంతు గతంలో డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అతనిపై డ్రగ్స్ కేసు నమోదు చేయడంతోపాటు... లోతైన విచారణ నిమిత్తం ప్రణీత్ ను 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
యూట్యూబ్ లైవ్ వీడియోలో తండ్రీకూతుళ్లపై ప్రణీత్ హనుమంతు అసభ్యకర కామెంట్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్ర దుమారం రేగింది. సెలెబ్రిటీలు సైతం అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ ఉద్యమం చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అతనిపై చర్యలకు తెలంగాణ పోలీసులకు ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు బెంగుళూరులో ప్రణీత్ హనుమంతుని ఈ నెల 10 న అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కి తీసుకొచ్చి 11న నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ప్రణీత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ప్రణీత్‌పై పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని 67బీ, సెక్షన్ 79, ఐపీసీ సెక్షన్ 294 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పలు సెక్షన్లు జత చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కేసులో దొరికితే ఎంతటివారినైనా వదిలేది లేదని సీఎం పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నార్కోటిక్స్ బృందాలు జరిపిన పలు రైడ్స్ లో సెలెబ్రిటీలు కూడా పట్టుబడుతున్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినవారిపై కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఒక కేసులో బుక్కై.. డ్రగ్స్ కేసు కూడా చుట్టుకోవడంతో ప్రణీత్ హనుమంతు పూర్తిగా ఇరుక్కుపోయినట్లు కన్పిస్తోంది. అతనిని విచారిస్తే డ్రగ్స్ కి సంబంధించి మరిన్ని విషయాలు సేకరించేందుకే మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది.