అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు.. అంతా తెలిసే..

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై నమోదైక కేసు కీలక మలుపు తీసుకుంది.

Update: 2024-12-16 13:00 GMT

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై నమోదైక కేసు కీలక మలుపు తీసుకుంది. అన్నీ తెలిసే అల్లు అర్జున్.. సంధ్య థియేటర్‌కు వచ్చారని, ఇది ముమ్మాటికీ అల్లు అర్జున్ బాధ్యారాహిత్యమే అని ఈ మలుపు చెప్పకనే చెప్తోంది. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. తాజాగా దీనిపై పోలీసులు స్పందించారు.

ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు. ఈ క్రమంలో ప్రీమియర్స్‌కు నటీనటులు, మూవీ టీమ్ ఎవరినీ రావొద్దంటూ థియేటర్ యాజమాన్యానికి వివరించారు. ఈ మేరకు చిక్కడిపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు సూచనలను తుంగలో తొక్కి హీరో ఆరోజు థియేటర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడటం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.

అంతేకాకుండా వచ్చిన హీరో.. సైలెంట్‌గా థియేటర్‌కు వెళ్లలేదని, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు తెలిపాయి. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి స్పృహ కోల్పోయిందని, వెంటనే స్పందించిన పోలీసులు.. ఆమెకు పీసీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే ఈ నెల 13వ తేదీన అంటే శుక్రవారం రోజున కేసులో భాగంగా అల్లు అర్జున్‌ను ఉదయం 11 గంటల 45 నిమిషాలను ఆయన నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అదే సమయంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రిమాండ్‌ పడిన క్రమంలో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇంతలోనే హైకోర్టు.. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే వీటిని అమలు చేయాలని చెప్పినప్పటికీ.. రాత్రి అంతా చంచల్‌గూడ జైలులో ఉంచి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు ఆయనను విడుదల చేశారు. ఈ కేసు విచారణ క్రమంలో ఈరోజు పోలీసులు తాము అందించిన రాత పూర్వక లేఖను విడుదల చేశారు.

Tags:    

Similar News