నడిరోడ్డుపైన దారుణ హత్య.. మహిళే కారణమా..!

హనుమకొండలో దారుణం జరిగింది. ఓ ఆటోడ్రైవర్‌ను మరో ఆటో డ్రైవర్ నడిరోడ్డుపైనే అత్యంత కిరాతకంగా హతమార్చాడు.;

Update: 2025-01-22 08:51 GMT

హనుమకొండలో దారుణం జరిగింది. ఓ ఆటోడ్రైవర్‌ను మరో ఆటో డ్రైవర్ నడిరోడ్డుపైనే అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు సమాచారం అందించడంతో సుబేదార్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడిని ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌కుమార్ ఆటోలో ఉన్న సమయంలో ఏనుగు వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకున్నారు. వారి మధ్య పాత పగలు ఏమైనా ఉన్నాయో? లేదో? తెలియదు కానీ.. వచ్చీరాగానే తనతో తెచ్చుకున్న కత్తితో వెంకటేశ్వర్లు దాడి చేశాడు. రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. రాజ్‌కుమార్‌ను దాదాపు 15సార్లు పొడిచాడు. దీంతో రాజ్‌కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంకటేశ్వర్లును చుట్టుపక్కల ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెంకటేశ్వర్లు ఆగలేదు. ఈ దాడిలో కత్తి గొంతులో దిగడంతో రాజ్‌కుమార్ అక్కడిక్కడే మరణించాడు. రాజ్‌కుమార్ చనిపోయిన వెంటనే వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసుల ప్రస్తుతం వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళే కారణమా..?

అయితే ఈ ఘటనకు సంబంధించి వివాహేతర సంబంధ కోణం కీలకంగా వినిపిస్తోంది. రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు ఇద్దరూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంలోనే వారిద్దరి మధ్య గొడవులు మొదలయ్యాయి. ఈ వివాదం కాస్తా పెరిగి పెద్దదయింది. దీంతో బుధవారం.. రాజ్‌కుమార్‌ను ఎలాగైన చంపేయాలనే పక్కా ప్లాన్‌తోనే వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకున్నాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అదే విధంగా హత్యకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నంలో కూడా పోలీసులు నిమగ్నమయ్యారు.

Tags:    

Similar News