‘మూడు నెలల్లో రూ.8,888 కోట్ల స్కామ్ చేసిన ఘనత రేవంత్‌దే’

అమృత్ టెండర్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2024-09-21 13:10 GMT

అమృత్ టెండర్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ టెండర్ల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ కట్టర్, టోచన్ సాహులకు కేటీఆర్ లేఖ కూడా రాశారు. ఈ అవినీతి నిగ్గు తేల్చాలని, లేని పక్షంలో ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని నమ్మాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ టెండర్ల పేరుతో రేవంత్ రెడ్డి అక్షరాలా రూ.8,888కోట్ల స్కామ్ చేశారని, ఇందుకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని ఆయన ఈరోజు ప్రకటించారు. తెలంగాణ అంతటా రేవంత్ అవినీతి కథా చిత్రమే నడుస్తోందని చురకలంటించారు. ఒకవైపు ప్రజలను మోసం చేస్తూ మరోవైపు పెద్దమనిషి మాటలు మాట్లాడుతున్నారని, అధికారం వచ్చిన మూడు నెలల్లోనే రూ.8,888 కోట్ల అవినీతి చేశారంటే.. ఇక ఐదేళ్లలో తెలంగాణను అంధకారంలో ముంచేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ చేసిన స్కామ్‌కు తమ దగ్గర ఉన్న ఆధారాలను బహిర్గం చేస్తూ.. తెలంగాన భవన్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అవినీతి అంతా కూడా తాను బాధ్యతలు వహిస్తున్న పురపాలకశాఖ కేంద్రంగానే రేవంత్ రెడ్డి చేశారని, దీని కారణంగానే ఆయన పదవి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు.

బెదిరించి మరీ టెండర్లు

‘‘సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి ఎటువంటి అర్హతలు లేకపోయినా వేల కోట్ల విలువైన పనులను సీఎం కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే సంస్థను పిలిచి బెదిరించి వారి పేరుతో బామ్మర్ది కంపెనీకి టెండర్లను కట్టబెట్టించారు. పనుల టెండర్లు సొంతం చేసుకుందని పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ కానీ పనులు చేస్తుందని మాత్రం రేవంత్ బామ్మర్ది. టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్‌ కంపెనీతో జాయింట్ వెంచర్ డ్రామా ఆడి రేవంత్ బామ్మర్ది రూ.1,137 కోట్ల కాంట్రాక్టు సొంతం చేసుకున్నారు. ఇందులో టెండర్ గెలుచుకున్న కంపెనీ 20 శాతం పని చేస్తుంటే.. సీఎం రేవంత్ బామ్మర్ది సంస్థ 80శాతం అంటే రూ.1000 కోట్ల పని చేస్తుంది. ఈ మేరకు ఐహెచ్‌పీ అనే సంస్థ సెబీకి సమాచారం ఇచ్చింది. ఇండియన్ హ్యూమ్‌ను శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి, ఆయన బామ్మర్ది కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగి.. అధికారులను భయపెట్టి మరీ సీఎం రేవంత్ ఈ కాంట్రాక్టులను తన బామ్మర్ది సంస్థకు కట్టబెట్టారు’’ అని కీలక ఆరోపణలు చేశారు కేటీఆర్.

ఇంటి బిందెలు నిపండానికి అక్రమ టెండర్లు

‘‘తన ఇంట్లోని లంకె బిందెలు నింపుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ టెండర్లకు తెరలేపారు. బామ్మర్ది కళ్లలో సంతోషం చూడటం కోసం ఎన్నుకున్న ప్రజల వెన్నునే విరిస్తున్నారు. అమృత్ టెండర్ల పేరిట రూ.8,888 కోట్ల కుంభకోణం చేశారు. అందుకనే రూ.8,888 కోట్ల టెండర్లకు సంబంధించిన వివరాలను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు. స్టాక్ ఎక్సేంజీలకు ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం పట్టడంతోనే ఈ టెండర్ల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది దక్కించుకున్న వందల కోట్ల టెండర్ల వ్యవహారం వెలుగు చూసింది. ఈ టెండర్లకు సంబంధించిన ఒక్క జీవోను కూడా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. రేవంత్ రెడ్డి పాల్పడుతున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచుతాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి ఎన్నో కుంభకోణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తన బామ్మర్దికి అమృతం పంచుతూ ఎన్నుకున్న ప్రజలకు విషాన్ని పంచుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి’’ అని మండిపడ్డారు కేటీఆర్.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రేమకథ

‘‘బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నారు. కేంద్ర పథకమైన అమృత్ పథకం అమల్లో జరిగిన అక్రమాలపై ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు ఎందుకు? ఈ స్కామ్‌లొ కాంగ్రెస్, బీజేపీ రెండూ కుమ్మక్కయ్యాయా. లేని పక్షంలో ఈ అమృత్ టెండర్ల కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతున్నా. అంతేకాకుండా ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. ఈ స్కామ్‌తో తనకు సంబంధం లేకపోతే వెంటనే ఈ టెంటర్లపై విచారణకు ఆదేశించాలి. అలా జరగని పక్షంలో రేవంత్ పాల్పడుతున్న పాపాల్లో బీజేపీ పాత్ర కూడా ఉందని నమ్మాల్సి వస్తుంది. ఈ విషయంలో స్పందించకుంటే మీ కుమ్మక్కు రాజకీయాలు తెలిసిపోతాయి. బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రెడ్డి మాట్లాడిన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బిజెపి మౌనం వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనకు నచ్చిన విచారణ సంస్థతో ఈ అంశంలో విచారణ చేయించాలి’’ అని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News