అమ్రాబాద్ అభయారణ్యం... పులులకు సురక్షిత ఆవాసం
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో 2024-25 సంవత్సరం నాల్గవ దశ పులుల సర్వే కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.;
By : Shaik Saleem
Update: 2025-07-18 00:01 GMT
ఎటూ చూసిన పచ్చని ఎత్తైన చెట్లు... కొండలు, కోనలు... గలగల పారుతున్న కృష్ణానదీ...పచ్చని ప్రకృతి అందాలతో కూడిన నల్లమల అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ ఏడాది తాజాగా జరిగిన ప్రాజెక్టు టైగర్ (Project Tiger) నాల్గవదశ పులుల పర్యవేక్షణలో వెల్లడైంది.తెలంగాణలోని (Telangana) పచ్చని చెట్ల నల్లమల సోయగాల నడుమ లోయల మీదుగా నీలిరంగులో పరుగులీడుతున్న కృష్ణమ్మ చెంత ఉన్న అమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యం (Amrabad Tiger Reserve)పులుల నివాసాలకు అనువుగా మారింది. దీంతో ఏ యేటి కా ఏడు పులుల సంఖ్య పెరుగుతూ అమ్రాబాద్ పులులకు సురక్షిత నిలయంగా మారింది.
ముగిసిన పులుల పర్యవేక్షణ కార్యక్రమం
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ)(NationalTigerConservationAuthority) ప్రోటోకాల్ ప్రకారం అమ్రాబాద్ అభయారణ్యంలో 2024-25 సంవత్సరానికి గాను నాల్గవ దశ పులుల పర్యవేక్షణ కార్యక్రమం (Tiger Population Monitoring) విజయవంతంగా ముగిసింది. పులుల పర్యవేక్షణలో అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగిందని వెల్లడైంది. 2024వ సంవత్సరం డిసెంబర్ 20 వతేదీ నుంచి ఈ ఏడాది మే నెల 15వతేదీ వరకు అమ్రాబాద్ లోని చెట్లకు 1594 కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేసి పులుల సంఖ్యను గణించారు. అమ్రాబాద్ పరిధిలోని పది ఫారెస్ట్ రేంజీల్లో నాలుగు ప్రాదేశిక బ్లాకులుగా విభజించి పులుల పర్యవేక్షణ జరిపారు. ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 797 ఫారెస్ట్ గ్రిడ్ లను కవర్ చేశారు. కెమెరాట్రాప్ డేటాను (Tigers Caught in Camera Traps) పులుల పగ్ మార్కులు, (Camera Trap Data,Pugmarks)స్కాట్ లు,స్క్రాప్, రేక్ మార్క్‌లు సంకేతాలతో కలిపి చూసి పులుల సంఖ్యను లెక్క పెట్టారు.
పులుల గణనలో వెల్లడైన వాస్తవాలు
ప్రాజెక్టు టైగర్ పులుల పర్యవేక్షణ కార్యక్రమంలో పలు విశేషాలు వెలుగుచూశాయి. అమ్రాబాద్ లో పులులకు మెరుగైన ఆవాసాల రక్షణ ఉండటం, పులుల వేటకు అవసరమైన జింకలు, దుప్పుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పులుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయని వన్యప్రాణుల విభాగం అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులుల సంఖ్య పెరగడం జీవవైవిధ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయని తెలంగాణ జూపార్కుల డైరెక్టర్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులుల రక్షణ కోసం అడవిలో ప్లాస్టిక్ నిర్మూలన, వేసవిలో నీటి కుంటల ఏర్పాటు, వేటగాళ్ల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు పులుల సంఖ్య పెరిగేందుకు సహాయ పడ్డాయని ఆయన వివరించారు.
అమ్రాబాద్ అభయారణ్యంలో కెమెరా ట్రాప్‌కు చిక్కిన పులి
అమ్రాబాద్ అడవిలో 36కు చేరిన పులుల సంఖ్య
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 2024-25 సంవత్సరంలో పులుల సంఖ్య 36కు పెరిగాయని పులుల పర్యవేక్షణలో తేలింది. ఇందులో 13 మగ పులులు, 20 ఆడపులులున్నాయి. ఈ కెమెరా ట్రాప్ లలో రెండు పులి కూనలున్నాయని వెల్లడైంది. ఓ పులిని గుర్తించలేక పోయారు. ఒక్కో పులికి మరో పులికి చారలు వేర్వేరుగా ఉంటాయి. ఏ పులి కూడా మరో పులి లాగా చారలు ఉండవు. విభిన్నంగా ఉన్న పులుల చారల సహాయంతో వీటికి టీ 1 నుంచి నెంబర్లు కేటాయిస్తారు.పులి కదలికలు ఏర్పడినపుడు కెమెరా ట్రాప్ లు ఆటోమేటెడ్ గా ఆన్ అయి వీడియోలు, ఫొటోలు తీసి పంపిస్తుంటాయి. వీటి సాయంతో ఇలా కెమెరా ట్రాప్ లకు చిక్కిన పులుల సంఖ్యను లెక్కిస్తారు. 2023-24 సంవత్సరంలో అమ్రాబాద్ లో 33 పులులుండగా వీటిలో 11 మగపులులుగా గుర్తించారు. 15 ఆడపులులు, ఏడు పులికూనలున్నాయని లెక్క తేలింది.
ఆడపులులే అధికం
అమ్రాబాద్ అభయారణ్యంలో ఆడపులుల సంఖ్య అధికంగా ఉండటంతో సంతానోత్పత్తి జరుగుతోంది. జూన్ నుంచి ఆగస్టు దాకా మూడు నెలల పాటు పులుల మేటింగ్ సీజనులో ఆడపులులు అడవిలో సంచరిస్తూ మూత్రం పోస్టుంటాయి.మేటింగ్ సీజనులో పులుల శృంగారానికి భంగం వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు అడవిలో జన సంచారంతో పాటు సఫారీ యాత్రలను నిలిపివేశారు. ఆడపులుల మూత్రం వాసన పసిగట్టిన మగ పులులు వచ్చి వాటితో శృంగారం జరుపుతుంటాయి. ఒక్కో ఆడపులిని మగపులి 40 సార్లు కలిస్తే అది గర్భం దాల్చి పులి కూనలకు జన్మనిస్తుంది. అమ్రాబాద్ అభయారణ్యం పులులకు సురక్షిత ఆవాసం కావడంతో (Safe Habitat) 20 ఆడపులులు ఉండటంతో సంతానోత్పత్తికి మార్గం సుగమమైంది. పెద్ద పులుల సంఖ్య 26 నుంచి 34కు పెరిగాయి.అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంతానోత్పత్తి విజయవంతంగా సాగుతుందని తాజా గణాంకాలు తేటతెల్లం చేశాయి.