దావోస్‌లో తగ్గేదేలే అంటున్న తెలంగాణ సర్కార్.. అమెజాన్‌తో భారీ ఒప్పందం
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు 2025లో తెలంగాణ సర్కార్ దూసుకెళ్తోంది.;
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు 2025లో తెలంగాణ సర్కార్ దూసుకెళ్తోంది. రోజురోజుకు భారీ ఒప్పందాలు చేసుకుంటూ రైజింగ్ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. దావోస్‌లో భాగంగా యూనీలివర్‌తో తొలి ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత వరుస ఒప్పందాలు చేసుకుంటుంది. తాజాగా అమెజాన్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హైదరాబాద్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ. 60000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి.
తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.
పది ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
ఇప్పటి వరకు దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ.1,32,500 కోట్ల పెట్టుబడులు రాబట్టింది. వీటితో రాష్ట్రంలో 46,000 ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. గురువారం మరిన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. రూ. 45,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ఉద్యోగాలు
2. అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలోభారీ పెట్టుబడులు. రూ. 60,000 కోట్లు.
3. కంట్రోల్ ఎస్ (CtrlS): తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్. 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్. రూ. 10,000 కోట్లు, 3,600 మందికి ఉపాధి.
4. జేఎస్ డబ్ల్యూ సంస్థ: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ - రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. రూ.800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు.
5. స్కైరూట్ ఏరో స్పేస్: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు. రూ.500 కోట్ల పెట్టుబడులు
6. మేఘా ఇంజనీరింగ్ (MEIL) మూడు కీలక ఒప్పందాలు. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్. రూ.15000 కోట్ల పెట్టుబడులు, 5250 మందికి ఉపాధి.
7. హెచ్సీఎల్.. టెక్ సెంటర్: హైటెక్ సిటీలో3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ కొత్త క్యాంపస్. 5000 మందికి ఉపాధి.
8. విప్రో : హైదరాబాద్ లో విప్రో కంపెనీ విస్తరణ. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్. 5,000 మందికి ఉద్యోగాలు.
9. ఇన్ఫోసిస్: హైదరాబాద్ లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్. రూ. 750 కోట్ల పెట్టుబడులు, 17,000 ఉద్యోగాలు.
10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు. దాదాపు వెయ్యి ఉద్యోగాలు.