శ్రీతేజను పరామర్శించిన అల్లు అరవింద్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజను అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఈరోజు పరామర్శించారు.

Update: 2024-12-18 12:20 GMT

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి అప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు శ్రీతేజను అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఈరోజు పరామర్శించారు. ప్రస్తుతం శ్రీతేజకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి ఇప్పటికి కూడా విషమంగానే ఉంది. ఈ కేసులో అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్వింద్ ఆరా తీయడం సంచలనంగా మారింది. అసలు ఇన్నిరోజులు వెళ్లని అరవింద్.. ఈరోజు ఎందుకు వెళ్లారు? అల్లు అర్జున్ కాపాడుకోవడం కోసమేనా? శ్రీతేజ తండ్రితో ఏదైనా డీల్ మాట్లాడుకోవడానికా? అంటూ అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ద్వారా కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్ కూడా అదే విషయం చెప్పారు.

అయితే ఈరోజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అల్లు అరవింద్.. శ్రీతేజ పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి రెస్పాన్స్ వస్తుందా రావట్లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. కాగా ఇప్పటికి కూడా శ్రీతేజ ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నారని, తామ చేయగలిగినంతా చేస్తున్నామని వైద్యులు వివరించారు. దీంతో ఎలాగైనా శ్రీతేజను బతికించాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈకేసు కోర్టు ఉండటం వల్ల.. ఆసుపత్రికి తన కుమారుడు అల్లు అర్జున్ రాలేదని, అతనికి బదులుగా తాను వచ్చానని అల్లు అరవింద్ చెప్పారు. శ్రీతేజ పరిస్థితి చూసి హృదయం తరుక్కు పోయిందని అన్నారు.

సీవీ ఆనంద్ ఏంచెప్పారంటే..

‘‘శ్రీతేజకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజకు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది. వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అతి త్వరలోనే వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారు’’ అని సీవీ ఆనంద్ వివరించారు. వైద్యలు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. శ్రీతేజ మెదడుకు ఆక్సిజన్ సరిపోవడం లేదని, దానిని వెంటిలేటర్ సహాయంతో అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆహారాన్ని ట్యూబ్ సహాయంతో అందిస్తున్నామని, 24 గంటలను శ్రీతేజ పరిస్థితి వైద్యులు పర్యవేక్షిస్తూ ఉంటున్నారని చెప్పారు.

బన్నీ బెయిల్ రద్దు..?

ఇదిలా ఉంటే డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను చంచల్‌గుడా జైలుకు తరలించే సరికి హైకోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ జరగడం, ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కాగా రూ.50వేల వ్యక్తిగత పూచికత్తుతో అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ వెళ్లి.. శ్రీతేజ పరిస్థితి పరిశీలించడం, వైద్యులతో చర్చించడం కీలకంగా మారాయి.

Tags:    

Similar News