తుపాకులతో కాల్చండి.. కానీ నా కాలేజీ కూల్చకండి - అక్బరుద్దీన్

హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.

By :  Vanaja
Update: 2024-08-26 13:21 GMT

హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. "నన్ను తుపాకులతో కాల్చండి. నాపై తల్వార్లు, కత్తులతో దాడి చేయండి. కానీ విద్యావ్యాప్తికి అంకితభావంతో నేను చేస్తున్న కృషికి అడ్డుపడకండి. నా కాలేజీని కూల్చకండి" అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సాలార్-ఏ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో 400 మంది మహిళలు, యువతులకు కుట్లు, మెహందీ, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిషు, వయోజన విద్య తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చారు. వీరికి బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ క్యాంపస్లో సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు అక్బరుద్దీన్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ... చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి, బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై స్పందించారు. "పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించా.. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వీటిపై వక్రదృష్టి పెట్టారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి.. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి. విన్నవిస్తున్నానని... నన్ను బలహీనుడిగా భావించొద్దు. శత్రువులను ఓడించే శక్తి నాకు అపారంగా ఉంది. ఇలాంటి ఎత్తయిన బిల్డింగులను మరిన్ని నిర్మిస్తా" అంటూ అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ నిర్మాణాలు కూల్చివేస్తారా?

ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వ నిర్మాణాలను కూడా కూల్చేస్తారా సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు కూడా కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కూల్చేస్తారా? జీహెచ్ఏంసీ ప్రధాన కార్యాలయం వద్ద నీటి కుంట ఉండేది దాన్ని కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబి ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉంది అది కూల్చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకి, ప్రైవేట్ ఆస్తులకి లింక్ పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలకు అతీతంగా హైడ్రా...

బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు హైడ్రా పై చేస్తున్న విమర్శలకు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తున్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటుచేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తుందన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందేనని చెప్పారు. రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్ఎండీఏ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందని తెలిపారు. తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్ లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలనీ నిర్ణయం తీసుకుందన్నారు.

2014 నుండి అధికారంలో వున్న బిఆర్ఎస్ అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని కోదండరెడ్డి మండిపడ్డారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్ పై ఎంఐఎం, బిఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారని చెప్పారు. అసదుద్దీన్ తండ్రి సలావోద్దీన్ నాకు బాగా తెలుసు.. అప్పటి నుండి నేను రాజకీయాల్లో వున్నాను. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డికాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైంది. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి కాపాడకుంటే ఎట్లా.. భవిష్యత్ కోసమే సీఎం రేవంత్ ఆరాటం అని కోదండరెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News