ఏడాది తర్వాత నిండిన సాగర్, ఆయకట్టు అన్నదాతల ఆనందం
కృష్ణమ్మ ప్రవాహంతో నాగార్జునసాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగర్ ఆయకట్టు సాగు కానుంది.
By : Shaik Saleem
Update: 2024-08-05 08:57 GMT
నాగార్జున సాగర్ జలాశయం ద్వారా తెలంగాణలో 6.3 లక్షల ఎకరాలు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.74 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి ఆశించినంత వరదనీరు చేరక పోవడంతో ప్రభుత్వం గత ఏడాది పొడవునా క్రాప్ హాలిడే ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటితోపాటు జలవిద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు.
- నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది సాగర్ లో నీరు లేక క్రాప్ హాలిడే ప్రకటించినందువల్ల పంటలు పండలేదని ఖమ్మం జిల్లాకు చెందిన రైతు టి ఆదినారాయణ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. ఈ ఏడాది సాగర్ నిండటం వల్ల తాము ఖరీప్ పంటలు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ కుడికాల్వ కింద ఉన్న ఆయకట్టుకు ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో సాగునీరు అందుతుందని పల్నాడు జిల్లాకు చెందిన రైతు, సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మాజీ అధ్యక్షుడు వడ్లమూడి అప్పారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సాగర్ జలాశయం నిండటంతో అధికారులతో కలిసి రైతులు కృష్ణమ్మకు జలహారతి పట్టామని అప్పారావు వివరించారు.
ఖమ్మం జిల్లాలో 2.55 లక్షల ఎకరాలకు సాగర్ నీరు
ఖమ్మం జిల్లాలో ఎన్కూరు, తిరుమలాయపాలెం మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో 2.55 లక్షల ఎకరాల ఆయకట్టు భూమిలో ఖరీఫ్ పంటల సాగుకు నీరందిస్తామని ఖమ్మం జిల్లా డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ పి బాల వెంకట ధంకర్ రెడ్డి ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. ఇందులో లక్షన్నర ఎకరాల్లో వరి పంటలు రైతులు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిశాక, ప్రాజెక్టు జలాశయంలో నీరు నిల్వ ఉంటే రబీ పంటల సాగుకు కూడా సాగునీరిస్తామని బాల వెంకట ధంకర్ రెడ్డి వివరించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీరు విడుదల
కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణానదీ ఎగువ పరివాహక ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద నీరు ఉరకలెత్తింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 582.6 అడుగుల మేర నీరు చేరింది.జలాశయంలో 312.05 టీఎంసీల నీటి నిల్వ కాగా, ప్రస్థుతం 290.51 టీఎంసీల నీరు చేరింది.
- శ్రీశైలం నుంచి 3,23,748 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాగార్జునసాగర్ ఆరుగేట్లు తెరచి కిందకు వరదనీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు వదులుతున్నందున మత్స్య కారులు చేపల వేటకు నదిలోకి వెళ్లవద్దని రెవెన్యూ అధికారులు కోరారు.
కృష్ణమ్మకు వరదనీరు
ఈ ఏడాది కృష్ణమ్మలో ఎగువనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కృష్ణా ప్రాజెక్టులు జలసిరితో కళకళ లాడుతున్నాయి.నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా నిండనున్నాయి.పులిచింతల ప్రాజెక్టు కూడా వరదనీటితో సందడిగా మారింది.
కృష్ణమ్మకు వరదనీటి ప్రవాహం
కృష్ణానదిలో ఎగువ నుంచి వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో పలు సార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఈ ఏడాది నదిలో వరదనీటి ప్రవాహం పెరగడంతో సాగర్ ఆరుగేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆరు గేట్లు ఎత్తడంతో తెల్లని నురగలతో కూడిన నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతూ నదిలో ప్రవహిస్తోంది.
- 2022వ సంవత్సరం ఆగస్టు 17వతేదీన సాగర్ 26 గేట్లు ఎత్తి 3.3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2021 వ సంవత్సరం ఆగస్టు 1వతేదీన,2020వ సంవత్సరం ఆగస్టు 12వతేదీన, 2019వ సంవత్సరం ఆగస్టు 12వతేదీన, 2018 ఆగస్టు 20వతేదీన సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచారు. గత ఏడాది తప్పితే మిగతా సంవత్సరాల్లో సాగర్ ఆయకట్టు రైతుల పోలాలకు సాగునీరిందించారు.