దుబాయ్‌లో సిరిసిల్ల నేతన్నకు అరుదైన గౌరవం
సిరిసిల్ల చేనేత కళకు వన్నెతెచ్చిన కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అద్భుత ఆవిష్కరణలు దుబాయ్ వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
By : Shaik Saleem
Update: 2024-10-21 13:57 GMT
దుబాయిలో సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్ ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి.దుబాయ్ లోని ఎమిరేట్స్ పద్మశాలి అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది.
- దుబాయ్ పద్మశాలి అసోసియేషన్ గుత్తికొండ రవిచంద్ర,సరస్వతిలు సిరిసిల్ల నేత కళాకారుని అరుదైన ప్రతిభను గుర్తించి దుబాయ్ కి ఆహ్వానించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో హరి ప్రసాద్ చేనేత మగ్గంపై నేసిన ఎన్నో అరుదైన ఆవిష్కరణలను ప్రదర్శించారు.
హరిప్రసాద్ నేసిన చీరల ప్రదర్శన
సిరిసిల్లలో పట్టుచీరలతోపాటు అంతరించిపోయిన పట్టు పీతాంబరాలను పునర్ సృష్టించిన హరి ప్రసాద్ ఆ చీరలను దుబాయ్ వేదికగా ప్రదర్శించారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర,దబ్బనంలో,ఉంగరంలో దూరే పట్టుచీరలతో పాటు వస్త్రాలపై నూలు పోగుల అల్లికతో రూపొందించిన పలు చిత్రపటాలను కూడా ఈ సందర్భంగా హరిప్రసాద్ ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు.
ఎన్నెన్నో అవార్డులు
నేతన్న హరిప్రసాద్ ఇప్పటికే చేనేత రంగంలో పలు ఆవిష్కరణలు రూపొందించి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను వస్త్రం పై నేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు అందుకున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల పట్టణంలోని మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో జన్మించిన హరి ప్రసాద్ తన తెలివితేటలతో చేనేత కళపై మక్కువతో మగ్గంపై అద్భుత ఆవిష్కరణలు చేశారు. ఈ కోవలో తన ప్రతిభను గుర్తించి దుబాయ్ దేశానికి ఆహ్వానించడం పట్ల దుబాయ్ ఎమిరేట్స్ పద్మశాలి అసోసియేషన్ సభ్యులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.