పోలీసులకు షాకిచ్చిన మందుబాబు: బ్రీత్ ఎనలైజర్‌తో పరార్!
ఓ మందు బాబు చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు పరుగులు పెట్టాల్సొచ్చింది.;
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారంటే మందుబాబులకు గుండెల్లో దడ మొదలవుతుంది. మందు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసులకు చిక్కకుండా ఉండటానికి నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది డ్రంక్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడి పోలీసులతో వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా చూశాం.
మందు కొట్టి డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారిలో కొందరు పోలీసులతో వింతవింతగా ప్రవర్తించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినవారూ ఉన్నారు. నేను మందు కొడతాను, మీ డబ్బులతో తాగట్లేదు కదా.. నా డబ్బులతో నేను తాగుతాను.. మధ్యలో మీకేంటి? అని వితండవాదం చేస్తూ పోలీసులకే చుక్కలు చూయించినవాళ్లు కూడా ఉన్నారు. ఇక మందు తాగారన్న అనుమానంతో డ్రంక్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్న పోలీసులు నోటి దగ్గర బ్రీత్ అనలైజర్ పెట్టి ఊదమంటే... లోపలికి పీల్చుకునే మహానుభావులు కూడా లేకపోలేరు. కానీ వీళ్లందరినీ మించిపోయాడు ఓ మందు బాబు.
తాజాగా బోయినపల్లి స్టేషన్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి షాకిచ్చాడు. డ్రంక్ డ్రైవ్ టెస్ట్ కోసం బ్రీత్ అనలైజర్ నోటి దగ్గర పెట్టగా.. ఆ మెషిన్ పట్టుకుని క్షణాల్లో అక్కడ నుండి ఉడాయించాడు. అతని చర్యతో ఖంగు తిన్న పోలీసులు ఛేజ్ చేసి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అతను చిక్కలేదు. ఇక చేసేది ఏమి లేక ట్రాఫిక్ పోలీసులు బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.