తెలంగాణలో 75 శాతం వక్ఫ్ భూముల ఆక్రమణ

తెలంగాణలో 57,423 ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.రూ.4లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.దీనిపై చర్యలు తీసుకోలేదు.;

Update: 2025-04-04 09:12 GMT
మసీదు స్థలాన్ని పరిరక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన బోర్డు

దేశంలో విలువైన వక్ఫ్ భూములున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు అయిదు లక్షల కోట్ల రూపాయల విలువగల భూములున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. వక్ఫ్ భూముల్లో 75 శాతం కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. గత సంవత్సరం 2,186 వక్ఫ్ భూములకు చెందిన రికార్డులు లేవని వక్ఫ్ బోర్డు హైకోర్టుకు తెలిపిందంటే అధికారుల నిర్వాకం ఎలాంటిదో విదితమవుతుంది. ఒకసారి వక్ఫ్ బోర్డు భూమి అని ప్రకటిస్తే అది ఎల్లప్పుడూ వక్ఫ్ దే అనేది బోర్డు అధికారులు చెబుతున్నా, 75 శాతం భూములు అన్యాక్రాంతం అయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఏమిటో విదితమవుతుంది.తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని బోర్డు అధికారులే అంచనా వేశారు.


ఆక్రమణల పాలైన వక్ఫ్ భూములు
వక్ఫ్ బోర్డు పాలకవర్గాలు, అధికారుల అవినీతి, అక్రమాల వల్ల వేలాది ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల పాలయ్యాయి. హైదరాబాద్ నగరంలోని వక్ఫ్ భూములు కబ్జాల పాలై ల్యాంకోహిల్స్ లాంటి భారీ భవనాలు వెలిసినా వక్ఫ్ బోర్డు అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. వక్ఫ్ భూములు కబ్జాదారుల పరమైనా, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన వక్ఫ్ బోర్డు చోద్యం చూస్తుంది.గత 30 ఏళ్లలో హైదరాబాద్ లోని విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. తెలంగాణలో మొత్తం 33,929 వక్ఫ్ సంస్థలున్నాయి. ఈ సంస్థల ఆధీనంలో 77,538.07 ఎకరాల భూములున్నాయని వక్ఫ్ బోర్డు రికార్డులే చెబుతున్నాయి. రికార్డుల్లో ఉన్నా ఇందులో 57,423.91 ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నాయని వక్ఫ్ బోర్డు అధికారులే చెబుతున్నారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ దారులతో బోర్డు ఉద్యోగులు, పాలకవర్గాలు కుమ్మక్కు అవడంతో వీటిని కాపాడే వారు కరువయ్యారు.



 ఏ జిల్లాలో ఎన్ని ఆక్రమణలంటే...

పూర్వ ఉమ్మడి మెదక్ జిల్లాలో వక్ఫ్ బోర్డుకు 23,910 ఎకరాల భూములుంటే, వీటిలో 23,782 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ 10,119 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉండడగా, ఇందులో 9,189 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని బోర్డు అధికారులే చెబుతున్నారు. రాజధాని నగరమైన హైదరాబాద్ లో 1785 ఎకరాలు విలువ గల భూముల్లో 1469 ఎకరాలు కబ్దాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది.రంగారెడ్డి జిల్లాలో 14785 ఎకరాల వక్ఫ్ భూముల్లో 13,480 ఎకరాలు మాయం అయి కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7,864 ఎకరాలు, నల్గొండలో 1400 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 12 ఎకరాలు,నిజామాబాద్ జిల్లాలో 23 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 143 ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణల పాలైన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వక్ఫ్ బోర్డు పట్టించుకోవడం లేదు.

కబ్జా అయిన భూముల్లో ఆక్రమణలను తొలగించాలి : ముహమ్మద్ సలీం
తెలంగాణలో 80శాతం వక్ఫ్ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని, వీటిని తొలగించి వక్ఫ్ ఆస్తులను కాపాడాలని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ సలీం డిమాండ్ చేశారు. మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతినిధి ‘ఫెడరల్ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వక్ఫ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తాము మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పక్షాన ఆందోళనలు చేస్తున్నామన్నారు. వక్ఫ్ దుకాణాల, భూముల అద్దెలను పెంచాలని తాము సూచించినా పాలకవర్గాలు చర్యలు తీసుకోవడం లేదన్నారు.


వక్ఫ్ సంస్థల అండదండలతోనే వక్ఫ్ భూముల ఆక్రమణ
తెలంగాణలో వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సిన సంస్థలే భక్షించాయి. రాష్ట్రంలో 1869 దర్గాలు, 8,521 ముస్లిం శ్మశానవాటికలు, 3,052 మసీదులు, 11,056 అష్రూఖానాలు, 6,789 ఛిల్లాలు, 112 టకియాలు, 2,530 ఇతర సంస్థలు మొత్తం కలిపి 33,929 వక్ఫ్ సంస్థలున్నా, ఆయా భూములు ఆక్రమణల పాలవుతున్నా పట్టించుకోకపోగా, వీటిని నిరోధించలేక పోయాయి.

కోట్లాది రూపాయల ఆస్తులున్నా వక్ఫ్ బోర్డు ఆదాయం తక్కువే...
తెలంగాణ వక్ఫ్ బోర్డుకు కోట్లాదిరూపాయల విలువగల భూములున్నా, అవి కాస్తా ఆక్రమణల పాలవడంతో బోర్డుకు ఆదాయం అరకొర మాత్రమే వస్తుంది. అద్దె, లీజులు, వక్ఫ్ ఫండ్, మ్యారేజ్ సర్టిఫికెట్లు, మ్యారేజ్ పుస్తకాల ద్వారా తక్కువ ఆదాయం వస్తుంది.

వక్ఫ్ బోర్డు అద్దె బాగోతాలు
వక్ఫ్ బోర్డు భవనాలు, స్థలాలు, దుకాణాల లీజు పేరిట నామమాత్రంగా చెల్లిస్తూ కొన్నేళ్ల నుంచి కొందరు స్వార్థపరులు వాటిని అనుభవిస్తున్నారు. వక్ఫ్ అద్దెదారులు కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన అద్దెలే చెల్లిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం కోట్లాదిరూపాయల అద్దెలు రావాలి.20,110 ఎకరాల్లో ఉన్న లీజుదారులు నామమాత్రంగా అద్దె చెల్లిస్తున్నారు. దీంతో వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి పడుతోంది.వక్ఫ్ బోర్డుకు అద్దెల రూపంలో ఏడాదికి కేవలం రూ.5కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. నామమాత్రపు అద్దెకూడా చెల్లించకుండా కొందరు బకాయి పెడుతున్నారు.

వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచాలి : మాజీ మంత్రి ముహ్మద్ మహమూద్ అలీ
తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచాలని మాజీ మంత్రి ముహ్మద్ మహమూద్ అలీ డిమాండ్ చేశారు. ‘ఫెడరల్ తెలంగాణ’తో మహమూద్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆదీనంలోని దుకాణాలకు అద్దెలు పెంచి మార్కెట్ రేటు కు అనుగుణంగా అద్దెలు పెంచాలని ఆయన సూచించారు.

మదీనా భవనంలో నామమాత్రపు అద్దెలే...
హైదరాబాద్ నగరంలో చార్మినార్ చెంత ఉన్న మదీనా వాణిజ్య భవనంలో 500కు పైగా దుకాణాలున్నాయి. ప్రస్థుతం మదీనా భవనంలో దుకాణాల ద్వారా ఏటా రూ.6కోట్ల కంటే ఎక్కువ ఆదాయం రావాలని అంచనా వేశారు. కానీ ఈ దుకాణాలను లీజుకు తీసుకున్న పాత రేట్లతో నామమాత్రపు అద్దెనే చెల్లిస్తున్నారు. కొందరు నామమాత్రపు అద్దె కూడా చెల్లించకుండా ఉండటంతో రూ. 30కోట్ల అద్దె బకాయిలు పేరుకుపోయాయి. వక్ఫ్ బోర్డు అధికారులు అద్దె చెల్లించని వ్యాపారులను తొలగించలేక పోతుంది. అద్దెలను కూడా పెంచలేక పోతున్నారు. అద్దె వివాదాలపై పలు కేసులు కోర్టుల్లో పెండింగులో ఉండటంతో వక్ఫ్ బోర్డు అద్దె ఆదాయానికి గండి పడుతుంది.

కోట్లాదిరూపాయల ఆస్తులున్నా...
వేల కోట్ల రూపాయల వక్ఫ్ ఆస్తుల ఆదాయంతో ముస్లిం విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించవచ్చని పాతబస్తీ పురానీ హవేలీకి చెందిన ఇస్లామిక్ పండితుడు ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ముస్లింల విద్యాభివృద్ధితోపాటు పేద ముస్లింల ఉపాధికి ఉపయోగపడేలా వక్ఫ్ బోర్డు ఆస్తులను వినియోగించుకోవాలని తాము వక్ఫ్ బోర్డు పాలకవర్గాలకు సూచనలు చేస్తున్నా, పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని ముజాహిద్ ఆరోపించారు.కోట్లాది రూపాయల వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతుండగా, పేద ముస్లిం విద్యార్థులకు విద్య అందని ద్రాక్షపండుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణకు ఆదేశించారు...చర్యలు మరిచారు
గత బీఆర్ఎస్ పాలనలో వక్ఫ్ భోర్డులో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించినా ప్రయోజనం లేకుండా పోయింది. 2017వ సంవత్సరంలో వక్ఫ్ ఆస్తుల రికార్డులను రక్షించాలనే పేరుతో ప్రభుత్వం రికార్డు రూంకు సీలు వేసింది. సీఐడీ విచారణకు ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వక్ఫ్ ఆస్తుల భూమి రికార్డులు అందుబాటులో లేక కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. వక్ఫ్ బోర్డు రికార్డులు చెదపురుగులు తింటున్నా, అధికారులు యాంటీ ఫంగల్ చర్యలు తీసుకోలేదు.

హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి : అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణలో అన్యాక్రాంతం అయిన వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి లేదా సీబీఐ లేదా సీఐడి తో విచారణ జరపాలని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల అసెంబ్లీలోనే డిమాండ్ చేశారు.


Tags:    

Similar News