‘50శాతం గ్రాడ్యుయేట్లకు స్కిల్స్ లేవు’

ప్రభుత్వమే చొరవ తీసుకుని యువతకు నైపుణ్య కోర్సులు ఎందుకు నేర్పించట్లేదు?;

Update: 2025-07-16 07:52 GMT

‘యువత కాలం చెల్లిన జ్ఞానాన్ని వదిలి పెట్టాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 50శాతం మంది యువతకు స్కిల్స్ నిల్‌గా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడిస్తుందని ఆయన గుర్తు చేశారు. స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పడమే కాకుండా ఎలాంటివి నేర్చుకోవాలో కూడా ఆయన వివరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపాయి. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.. ప్రస్తుత విద్యారంగంలో అందుతున్న చదువులను కాలం చెల్లిన జ్ఞానం అనడం కీలకంగా మారింది. కాలం చెల్లిన జ్ఞానమని తెలిసినా.. ప్రభుత్వం ఇంకా దానినే ఎందుకు కొనసాగిస్తుంది? అన్న సందేహాలకు రేకెత్తిస్తోంది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాటి స్థానంలో మంచి కోర్సులు ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నిర్వహించిన ఫ్రీఆన్‌లైన్ఐటీ ట్రైనింగ్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో పాల్గొన్న శ్రీధర్ బాబు.. మన విద్యారంగంలో అందిస్తున్న చదువులు, యువత నైపుణ్యాలు, ఉద్యోగాల వేటలో ఉన్న కష్టాల గురించి ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు అనేక అంశాలను లేవనెత్తుతోంది. అన్నీ తెలిసీ ప్రభుత్వం ఎందుకు ఏం చేయడం లేదని ప్రశ్నించే స్థాయికి వచ్చింది.

డిగ్రీ ఉంటే ఉద్యోగం రాదు: శ్రీధర్ బాబు

‘‘ఒకప్పటిలా చేతిలో డిగ్రీ ఉన్నంత మాత్రాన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. స్కిల్ ఉంటే ఉద్యోగమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న గ్రాడ్యుయేట్స్‌లో 50శాతం మందికి స్కిల్స్ లేవు. వాటిని నేర్చుకోవడంపై యువత ఫోకస్ పెట్టాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై యువత అవగాహన పెంచుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం.. 2025 నాటికి ఆటోమేషన్, ఏఐ వల్ల 8.5 కోట్ల ఉద్యోగాలు పోతే 9.7కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవాలంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, టీమ్ వర్డ్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి స్కిల్స్ ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్‌తో కూడిన హార్డ్‌వర్క్‌, వినూత్న ఆలోచనలు.. విజయానికి సోపానాలు’’ అని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది..?

యువతకు స్కిల్స్ లేవు. స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. కాలేజీల్లో అందిస్తున్న విద్య.. సర్టిఫికెట్ కాగితంగానే ఉంటుంది తప్ప.. కావాల్సిన స్కిల్స్‌ను అందించడం లేదు. కాలేజీల్లో అందుతున్నది కాలం చెల్లిన జ్ఞానం అని కూడా ప్రభుత్వానికి తెలుసు. మంత్రి హోదాలో ఉన్న నేత స్వయంగా చెప్పారంటే.. ఇది చిన్న సమస్య, చిన్న విషయం అసలే కాదు. మరి అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదు. స్కిల్ యూనివర్సిటీ కలల ప్రాజెక్ట్ అంటున్న ప్రభుత్వం.. ఉన్న యూనిర్సిటీల్లో స్కిల్ ప్రోగ్రామ్స్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు. కొత్త యూనివర్సిటీ కట్టి.. అందులో ప్రత్యేక శిక్షణ పొందండి అని చెప్పే బదులు.. ఉన్న ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లోనే ప్రత్యేక కోర్సులు తీసుకురావొచ్చు కదా..? డిగ్రీతో పాటు మూడు సంవత్సరాల పాటు స్కిల్స్‌పై విద్యార్థులు ఫోకస్ పెడితే.. కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి వాళ్లు ఆ స్కిల్స్‌లో నిష్ణాతులు అవుతారు కదా? ఈ విషయంలో ప్రభుత్వం చొరవ ఎందుకు తీసుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికీ ఆ ఆలోచనే లేదే..!

కాలేజీల్లో నేర్పిస్తున్నది కాలం చెల్లిన జ్ఞానం అని.. శ్రీధర్ బాబు చెప్పిన మాటల్లో స్పష్టం అవుతుంది. అది తెలిసి కూడా దానిని మార్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. యువతకు ఈ ప్రపంచంతో పోటీ పడే జ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా కళాశాలలు తీర్చిదిద్దాలని ఎందుకు అనుకోవడం లేదు. యువతకు స్కిల్స్ లేవని.. సభాముఖంగా చెప్పిన మంత్రి.. ఈ సమస్యకు పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎందుకు చెప్పలేదు. యువత స్కిల్స్ నేర్చుకోండి అని చెప్తున్న ప్రభుత్వం.. ఎక్కడ నేర్చుకోవాలో ఎందుకు చెప్పడం లేదు. ఫీజులు కూడా కట్టుకులేని స్థితిలో ఉన్న పేద విద్యార్థుల గురించి ఆలోచించయినా.. ప్రభుత్వమే కళాశాలల్లో ప్రత్యేక స్కిల్ ప్రోగ్రాం ఎందుకు ప్రారంభించడం లేదు. ఇప్పటికి కూడా ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్తున్నారే తప్పితే.. ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలు, కళాశాలల్లోనే స్కిల్ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయట్లేదనేది ప్రజలకు అడుగుతున్నారు. మరి ఇప్పటికయినా కనీసం పైలట్ ప్రాజెక్ట్‌గా అయినా.. యువత స్కిల్స్ పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందేమో చూడాలి.

Tags:    

Similar News