165 మంది సైబర్ నేరగాళ్లకు అరదండాలు,దేశంలోనే తెలంగాణ రికార్డ్
సైబర్ నేరగాళ్లకు అరదండాలు వేయడంతో తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు.300 కేసుల్లో 165 మంది నిందితులను పట్టుకొని రికార్డు సృష్టించారు.
By : Shaik Saleem
Update: 2024-11-14 12:36 GMT
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సైబర్ మోసాల కేసుల్లో 165 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పట్టుకుంది. తెలంగాణ సైబర్ పోలీసులు ఆంధ్రప్రదేశ్, అసోం, న్యూఢిల్లీ, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సైబర్ నేరస్థులను అరెస్టులు చేశారు.మూడు వేలకు పైగా కేసుల్లో వీరు నిందితులని దర్యాప్తులో తేలింది. 165 మంది సైబర్ నేరగాళ్లకు అరదండాలు వేసిన తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే రికార్డ్ సృష్టించారు.
సైబర్ మోసాలెన్నో...
తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సైబర్ నేరగాళ్లకు తెలంగాణలో 76 కేసుల్లో ప్రమేయం ఉందని తేలింది. తెలంగాణలో 795 సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 3,357 కేసులతో ఈ నిందితులకు సంబంధం ఉందని తేలింది.నేరస్థులు పార్ట్ టైమ్ జాబ్ స్కామ్‌లు, స్టాక్ ట్రేడింగ్ మోసాలు, లోన్ మోసాలు, హ్యాకింగ్, సైబర్ మోసాలు, సెక్స్‌టార్షన్‌లతో సహా పలు రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఉన్నత విద్యావంతులే సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చారని తెలంగాణ సైబర్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.నేరగాళ్లలో 45 శాతం మంది గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు,34 శాతం వ్యాపారవేత్తలు, 21 శాతం స్వయం ఉపాధి, 9 శాతం మంది విద్యార్థులున్నారు.
సైబర్ నేరగాళ్లపై కేసులు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, స్థానిక పోలీసుల సమన్వయంతో సైబర్ నేరాలపై రాష్ట్రవ్యాప్తంగా 48 మంది అనుమానితులను అరెస్టు చేశారు.తెలంగాణలో 508 కేసుల్లో నిందితులని గుర్తించారు. 8.16 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు.ఐటీఏ చట్టం 2008, సెక్షన్ 66డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ చట్టంలోని నిర్దిష్ట సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.వ్యాపార పెట్టుబడి మోసాలు, ఉద్యోగ మోసాలు, డిజిటల్ గుర్తింపు ,కొరియర్ స్కామ్‌లు వంటి సైబర్ నేరాలకు పాల్పడ్డారని వెల్లడైంది.
సైబర్ పోలీసుల దాడుల్లో ఏం దొరికాయంటే...
టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్, ఎస్పీ దేవేందర్ సింగ్ నేతృత్వంలోని సైబర్ పోలీసులు సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. వీరిద్దరికి గతంలోనూ సైబర్ నేరాలను నిరోధించడంలో చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో అవార్డులు సైతం వచ్చాయి.సైబర్ పోలీసుల దాడుల్లో 53 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు, 5 సీపీయూలు, 2 మానిటర్లు, 18 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 16 చెక్ బుక్‌లు, 10 ఏటీఎం కార్డులు, బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైం పోలీసుల సూచనలు
అత్యాశకు పోయి సునాయాసంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అన్ లైన్ లో డబ్బులు పెట్టుబడి పెడితే డబ్బులు పోతాయని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ చెబితే మీ ఖాతాలో డబ్బులు మాయం చేస్తారు జాగ్రత్త అని సైబర్ పోలీసులు హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండండి, అత్యాశకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దని వారు స్కాం అలర్ట్ జారీ చేశారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులకు డయల్ 1930, వాట్సాప్ నంబరు 8712672222లకు ఫోన్ చేయాలని శిఖా గోయల్ సూచించారు.
— Cyber Crimes PS Hyd City Police (@CyberCrimeshyd) November 12, 2024