సందర్శకులకు తలుపులు తెరిచిన సుప్రీం కోర్టు..

సుప్రీంకోర్టుకు ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక తీరనుంది. శనివారాల్లో చూసేందుకు అవకాశం కల్పించారు.;

Update: 2025-01-10 12:55 GMT

ఢిల్లీ(Delhi)లో సుప్రీం కోర్టు ఎలా ఉంటుంది? అత్యున్నత న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్ని కోర్టులున్నాయి? ఏ కేసులు ఏ కోర్టులో వాదిస్తారు? సుప్రీం చారిత్రక నేపథ్యం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. సుప్రీంకోర్టును ఒక్కసారయిన చూడాలన్న కోరిక కూడా కొందరిలో ఉంటుంది. ఆ అవకాశం రానే వచ్చింది.

ఇకపై ఏడాది పొడువున శనివారాల్లో (రెండో, నాలుగో శనివారాలు, ప్రభుత్వ సెలవులు మినహా) సుప్రీంకోర్టు(Supreme Court)ను సందర్శించవచ్చు. నాలుగు విడతలుగా సందర్శకులను అనుమతిస్తారు. ఒక్కో గ్రూప్‌లో గరిష్టంగా 40 మందిని అనుమతిస్తారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు, 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు, 3.30 నుంచి సాయంత్రం 5 వరకు టూర్ కొనసాగుతుంది. గంటలో పర్యటన పూర్తవుతుంది.

సందర్శకుల వెంట వచ్చే గైడ్..కోర్టు గదులు, నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొత్త గ్రంథాలయాన్ని చూయిస్తూ వివరిస్తారు. టూర్‌లో ఫోటోగ్రఫీకి అనుమతించరు. కెమెరా లేదా సెల్‌ఫోన్ వాడకం నిషేధం. టూర్ స్లాట్ సమయం కంటే అర్ధగంట ముందుగా కోర్టు వద్దకు చేరుకోవాలి. పర్యటనకు ఆన్‌లైన్‌లో బుకింగ్ తప్పనిసరి.

మొదటి పర్యటన నవంబర్ 3, 2018న జరిగింది. ఇప్పటివరకు 296 పర్యటనలు పూర్తయ్యాయి. సుప్రీం కోర్టు భవనాన్ని 1958లో నిర్మించారు. 1954లో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీని శిలాఫలకాన్ని ప్రారంభించారు. కోర్టు భవన నిర్మాణం, చరిత్ర దేశ న్యాయపరంపర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

విజిటర్ రిజిస్ట్రేషన్ కోసం దిగువన ఉన్న లింకును క్లిక్ చేయాలి.

https://guidedtour.sci.nic.in/visitregistration.drt

Tags:    

Similar News