'ఎవరు చంపారు'? ధర్మస్థలలో సౌజన్య హత్య కేసు మళ్లీ తెరపైకి..

దర్యాప్తు సంస్థల వైఫల్యం, రాజకీయ ఒత్తిళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు..;

Update: 2025-09-17 09:49 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)మాజీ ఎంపీ ప్రజ్వల్ కేసులో మహిళలకు న్యాయం చేయాలని చేపట్టిన 'హసన్ చలో' కార్యక్రమం ఏ స్థాయిలో జరిగిందో మనకు తెలిసిందే. తిరిగి అదే స్థాయిలో మరో మహిళా ఉద్యమం ఊపిరిపోసుకుంటుంది. ఈ సారి సౌజన్యకు ధర్మస్థల కేసులో న్యాయం చేయాలని డిమాండ్‌ను తెరమీదకు తెస్తున్నాయి మహిళా సంఘాలు, పౌర హక్కుల కార్యకర్తలు, రచయితలు. 2012లో అత్యాచారం, హత్యకు గురయిన సౌజన్య కుటుంబానికి న్యాయం జరగాలన్నది వారి ప్రధాన డిమాండ్.


గాంధీభవన్‌లో సమావేశం..

'We-You with the Suffered' అనే సంస్థ 'Who Killed?' శీర్షికతో బెంగళూరులోని గాంధీ భవన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 16) నిర్వహించిన సమావేశానికి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మందికి పైగా మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. వారంతా దర్యాప్తు సంస్థల వైఫల్యం, రాజకీయ ఒత్తిళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామూహిక ఖననాల సమస్య తెరపైకి వచ్చినా.. పాత హత్య కేసులు ఇంకా పరిష్కారానికి నోచుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుల ముమ్మర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.


‘ఉగ్రప్ప కమిటీ నివేదికను అమలు చేయాలి..’

మహిళలు, పిల్లలపై లైంగిక హింసను నిరోధించే ఉగ్రప్ప కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుంధర భూపతి. ఈమె రచయిత్రి కూడా. ఈ కమిటీ ధర్మస్థలంలో వందలాది అసహజ మరణాలను హైలైట్ చేసింది. ఈ సందర్భంగా వసుంధర భూపతి మాట్లాడుతూ..‘‘ సిట్ దర్యాప్తు, రాజకీయ నాయకుల ప్రకటనలను చూస్తే నిజం మళ్ళీ సమాధి అవుతుందన్న భయం నెలకొంది. ఉగ్రప్ప కమిటీ నివేదికను అమలు చేయాలి. నేను ఆ కమిటీలో భాగం. జవాబుదారీతనం లేకుండా ఒకే చోట ఇన్ని మరణాలు ఎలా జరుగుతాయి? అని ఆమె ప్రశ్నించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశామని కూడా చెప్పారు.


ఎవరీ సౌజన్య..

2012లో ధర్మస్థలం(Dharmasthala)లో అత్యాచారం, ఆపై హత్యకు గురయిన 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని సౌజన్య(Soujanya). చాలా సంవత్సరాలు గడిచినా అసలు నిందితులు పట్టుబడలేదు. దర్యాప్తులో ఏమీ తేలలేదు. ఆ సమయంలో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దర్యాప్తులో ఆశించనంత స్థాయిలో దర్యాప్తు జరగలేదని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.

Tags:    

Similar News