వయనాడ్ విషాదం.. బతుకుపై ఆశను చిగురింపజేస్తున్న కౌన్సెలింగ్ బృందాలు

ఇక తమవారు లేరని తెలిసిన కొందరి జీవితాల్లో తీవ్ర నిరాశ అలముకుంది. జరిగిన దుర్ఘటనను తలచుకుంటూ కుమిళిపోతున్నారు. కౌన్సెలర్లు వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు.

Update: 2024-08-03 11:07 GMT

కేరళలోని వాయనాడ్‌లో భారీ విధ్వంసం వందల మంది ప్రాణాలను బలిగొంది. కొండచరియలు విరిగిపడడంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి. 200 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మరో 300 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. బతికే ఉంటారన్న ఆశతో వారి కుటుంబసభ్యులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

ఇక తమవారు లేరని, రారని తెలిసిన మరికొంతమందిలో తీవ్ర నిరాశ అలముకుంది. జరిగిన దుర్ఘటనను తలచుకుంటూ..పోయినోళ్లతో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకుని కుమిళిపోతున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయిన వారిని ఓదార్చడం అంత తేలిక కాదు. అనుకోకుండా దూరం కావడాన్ని జీర్ణించుకోవడం సులభమేం కాదు. బాధాతప్త హృదయాలకు మానసిక ఉపశమనం అత్యంత అవసరం. జీవింతపై ఆశలు చిగురింపజేసేందుకు కౌన్సిలింగ్ అవసరం. ఇదే పని ఇప్పుడు కేరళ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ బృందాలు ఆ దిశగా తమ పని మొదలుపెట్టాయి. ఒకరికి కోల్పోవడంతో జీవితం ముగిసిపోదని ధైర్యం చెబుతున్నారు. మానసిక బలాన్ని పెంపొందిస్తున్నారు.

‘బతుకుపై ఆశను రేకెత్తించారు’

విపత్తులో తన భర్త, ఇద్దరు పిల్లలను కోల్పోయిన మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి జీవించాలన్న ఆశను చిగురింపజేశారు. "కౌన్సెలర్లు నా మనోవేదనను అర్థం చేసుకున్నారు. నాకు సాయం చేశారు. భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో సలహా ఇచ్చారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని మహిళ చెప్పింది.

‘డిప్రెషన్ నుంచి బయటపడేశాం’

తన ఇంటిని కోల్పోయి ప్రస్తుతం పునరావాస శిబిరంలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అతని మనోవేదనను దూరం చేశామని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ‘‘పరిస్థితులను బట్టి అతను తీవ్ర నిరాశలో ఉన్నాడని మాకు అర్థమైంది. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చాం. అందులోంచి బయటపడ్డాడు.’’ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.

NGOలతో కలిసి ..

మానసిక వైద్య నిపుణులు తమ పరిధిని విస్తరించడానికి NGOలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్ల సాయంతో కౌన్సిలింగ్ అవసరమైన వ్యక్తులను గుర్తించడం సులభమవుతోంది. స్వచ్ఛంద సేవకుడు అబ్రహం కోజీ ఇలా పేర్కొన్నాడు .. “మా సహాయక చర్యలకు కౌన్సెలింగ్ సేవలు తోడవ్వడం వల్ల కుటుంబసభ్యులను కోల్పోయిన వారిలో మార్పు గమనిస్తున్నాం. వారిలో బతకాలన్న కోరిక తిరిగి వచ్చింది’’ అని చెప్పారు.

‘మానసిక ఇబ్బందులను తొలగించడమే లక్ష్యం’

కుటుంబసభ్యులను పోగొట్టుకున్న వారిలో మానసిక ఆందోళన దూరం చేయడానికి కేరళ రాష్ట్ర యువజన కమిషన్ కూడా కౌన్సెలింగ్, థెరపీ ఇప్పించే చొరవ తీసుకుంది. స్వచ్ఛందంగా పాల్గొనడానికి అర్హత కలిగిన కౌన్సెలర్‌లను కమిషన్ ఆహ్వానిస్తున్నామని కేరళ రాష్ట్ర యువజన కమిషన్ చైర్మన్ ఎం షాజర్ చెప్పారు. ఉపద్రవం కారణంగా క్షతగాత్రులు, కుటుంబసభ్యులను కోల్పోయిన వారిలో తలెత్తే మానసిక ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. “విపత్తు వల్ల కలిగిన మానసిక గాయానికి త్వరిత ఉపశమనం కోసం వీలైనంత ఎక్కువ మంది మానసిక వైద్యుల సేవలను వినియోగించు కోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు.  

Tags:    

Similar News