విజయ్‌కి ఏఐఏడీఎంకే ఆహ్వానం
‘‘డీఎంకేను గద్దెదించడమే మా లక్ష్యం. కలిసివచ్చే పార్టీలకు ఇదే మా ఆహ్వానం’’ - ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామి;
తమిళనాడు(Tamil Nadu)లో అధికార పార్టీ డీఎంకే(DMK)ను ఓడించడమే తమ లక్ష్యమని ఎఐఎడిఎంకె(AIADMK) ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పేర్కొన్నారు. అందుకే కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోడానికి మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీవీకే (TVK) చీఫ్ విజయ్ కూడా మాతో చేతులు కలపాలని కోరుతున్నామని చెప్పారు. రెండు ఆకులున్న పిడికిలితో కూడిన పార్టీ ఎన్నికల ప్రచార లోగో, నేపథ్యంలో అన్నాడీఎంకే జెండాను ప్రారంభించిన పళనిస్వామి, డీఎంకేను ఓడించాలనే ఏకగ్రీవ అభిప్రాయంతో అన్ని రాజకీయ పార్టీలు కూటమిని బలోపేతం చేసి కలిసి పోటీ చేయాలని అన్నారు.
"నా దృష్టిలో.. ప్రజా వ్యతిరేక డీఎంకేను ఓడించడానికి సారూప్య పార్టీలన్నీ ఏకం కావాలి. డీఎంకేను ఓడించాలనుకునే పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వారి సహకారం అవసరం" అని మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి చెప్పారు.
2026 ఎన్నికల కోసం AIADMK రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పళనిస్వామి కొత్త లోగోను ఆవిష్కరించారు. ‘‘మక్కలై కాపోం, తమిఝగథై మీట్‌పోం’’ (ప్రజలను రక్షిద్దాం, తమిళనాడును విమోచిద్దాం) నినాదంతో జూలై 7న కోయంబత్తూరులోని మెట్టుపాళయం నుంచి ఆయన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.