ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య వెనక ఇద్దరు మహిళా గ్యాంగ్‌స్టర్లు..

తమిళనాడులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ఇద్దరు మహిళా గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. వీరు హత్యకు ఎలా ప్లాన్ చేశారంటే..

Update: 2024-07-21 14:50 GMT

తమిళనాడులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. చెన్నైలోని మహిళా గ్యాంగ్‌స్టర్ల చీకటి ప్రపంచం, వారి రాజకీయ సంబంధాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మహిళా గ్యాంగ్‌స్టర్ అంజలైని పోలీసులు పట్టుకున్నారు.

గత వారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన తిరువెంగడం సహా ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు సంబంధించి గ్రేటర్ చెన్నై పోలీసులు ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేశారు.

బాంబులతో లేదంటే నరికి చంపడం..

అంజలై అరెస్టు, విచారణ తర్వాత ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులకు తెలిశాయి. ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి. హంతకులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేయడానికి రెండు ప్లాన్లు వేశారు. ఒకటి నరికి చంపడం, రెండోది అతని కారుపై బాంబులు విసిరి చంపడం.

ప్రతీకారం కోసం..

ఆర్కాట్ సురేష్ భార్య అంజలై, ప్రత్యర్థుల దాడిలో భర్తను కోల్పోయిన తొట్టం శేఖర్ భార్య మలర్‌కోడి ఆర్మ్‌స్ట్రాంగ్‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి హత్యకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఇద్దరి మహిళా గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఇప్పుడు ఈ కేసులో చర్చనీయాంశంగా మారింది.

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య..

జూలై 5న వేణుగోపాల స్వామి కోయిల్ స్ట్రీట్‌లో తన ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చెన్నైలోని సెంబియం ప్రాంతంలో ఎనిమిది మంది సభ్యుల ముఠా హత్య చేసింది. హత్య తర్వాత చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఆర్కాట్ సురేష్ సోదరుడు తిరువేంగడం, పొన్నై బాలు అనే ఇద్దరు వ్యక్తులు పోలీసుల ముందు లొంగిపోయారు. 48 గంటల్లో మరో ఆరుగురిని అరెస్టు చేసి, కేసు ముమ్మర దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.

పోలీస్ కమిషనర్ బదిలీ..

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య, ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చెన్నై పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ బదిలీ చేసి, ఆయన స్థానంలో అరుణ్‌ను నియమించారు. ఈ కేసును అరుణ్ స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో చాలా మందిని అరెస్టు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది నిందితులు తమ సెల్ ఫోన్లను నదిలోకి విసిరేశారు. స్కూబా డైవర్లు, అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో వాటిని తిరిగి పోలీసులు సంపాదించగలిగారు.

హత్య జరిగిన తీరుపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. తిరువేంగడం, ఇతరులు మారణాయుధాలతో ఆర్మ్‌స్ట్రాంగ్‌పై ఎలా దాడి చేశారో, కొన్ని నిమిషాల్లో అతన్ని ఎలా నరికి చంపారో అందులో రికార్డయ్యింది.

అసలైన నిందితులెక్కడ?

ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబ సభ్యులు, బిఎస్‌పి పార్టీ అధినేత మాయావతి, తమిళనాడులోని చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య వెనుక అసలు నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపించారు.

ఇద్దరు మహిళా గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ కావడంతో తమకున్న రాజకీయ సంబంధాలను ఆయా పార్టీల నేతలు తెంచేసుకున్నారు.

పార్టీల నుంచి తొలగింపు..

బీజేపీ కార్యకర్త అయిన అంజలై, ఏఐఏడీఎంకే కార్యకర్త అయిన మలర్‌కోడిల పార్టీ సభ్యతం రద్దు చేశాయి. పదవుల నుంచి కూడా తొలగించారని సమాచారం. వడ్డీవ్యాపారం, భూకబ్జాలకు సంబంధించిన అనేక కేసుల్లో ఇంతకుముందు వీరిద్దరూ అరెస్టయ్యారు.

అలా పరిచయం..

గత ఏడాది తన భర్త ఆర్కాట్ సురేష్ హత్యలో ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రమేయం ఉందని అనుమానించిన అంజలై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఆర్కాట్ సురేష్ బావమరిది అరుల్ దేశీవాలీ బాంబుల కోసం మలర్కోడి కలిసినపుడు ఆమె వీరితో జతకట్టింది.

మలర్‌కోడి క్లాస్ మేట్ అరుల్..

1997లో జరిగిన గ్యాంగ్ వార్‌లో భర్తను కోల్పోయిన మలర్‌కోడి 2019లో లా డిగ్రీని కూడా పూర్తి చేసింది. తన ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. అరుల్ ఆమె క్లాస్‌మేట్. హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఆమె తన కుమారుడు అజుగురాజా జీ-పే నంబర్‌ను అరుల్‌కు ఇచ్చింది.

ఇప్పటివరకు చెన్నై పోలీసులు మలర్‌కోడి ద్వారా దేశీయ బాంబుల కొనుగోలుకు సంబంధించి రూ.10 లక్షల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు ముందు కిరాయి హంతకులు అంజలై ద్వారా రూ. 15 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలున్నాయి. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు ముందు అంజలై కిరాయి హంతకులకు ఆశ్రయం కల్పించారు.

ఆర్మ్‌స్ట్రాంగ్ ఆదరణే ఆయన హత్యకు దారితీసింది..

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య వెనుక ఉద్దేశ్యం, హత్య చేయడానికి హిస్టరీ-షీటర్‌లు ఎలా జతకట్టారు అని అడిగినప్పుడు.. ఒక సీనియర్ పోలీసు అధికారి ది ఫెడరల్‌తో ఇలా చెప్పారు. "15 రోజుల్లో ప్రతీకార హత్యకు దారితీసిన పరిస్థితులపై అంచనాకు వచ్చాం. ఈ కేసులో మహిళా గ్యాంగ్‌స్టర్లు రాజకీయంగా ఎదగడం, ఉత్తర చెన్నైలో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా గ్యాంగ్‌స్టర్‌ల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఆర్మ్‌స్ట్రాంగ్‌పై చాలా క్రిమినల్ కేసులున్నా.. ఇటీవలి కాలంలో ఆయన దళిత రాజకీయ నాయకుడిగా ఎదగడం కూడా గ్యాంగ్‌స్టర్లకు కోపం తెప్పించిందని అధికారి చెప్పారు. అతను తన మీదున్న కేసులు కూడా తగ్గిపోయాయి.

Tags:    

Similar News