వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలపై కేరళ కీలక నిర్ణయం
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు.. నివేదిక ఇవ్వాలని ఆదేశాలు;
By : Praveen Chepyala
Update: 2025-01-15 11:03 GMT
గత ఏడాది వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి ఇంకా ఆచూకీ దొరకని వారందరిని చనిపోయినట్లు ప్రకటించాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలంటే కొన్ని నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని, అందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు భారీ ఉపశమనం కలిగించింది. ఈ విషయం పై తప్పిపోయిన వారి జాబితాలను పరిశీలించాలని రెవిన్యూ శాఖ అధికారులు సహ స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక కమిటీలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ అధికారి, సంబంధిత పోలీస్ స్టేషన్ ల హౌజ్ ఆఫీసర్ సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తప్పిపోయిన వ్యక్తుల జాబితాను సిద్ధం చేసి పరిశీలన కోసం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ)కి అందజేస్తుంది.
డీడీఎంఏ బాబితాను పరిశీలించి దాని సూచనలతో రాష్ట్ర స్థాయి కమిటీకి పంపుతుంది. అదనపు కార్యదర్శి(హోం) రెవెన్యూ, స్థానిక స్వపరిపాలన ప్రధాన కార్యదర్శులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీ జాబితాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపాలని ఉత్తర్వూల్లో పేర్కొంది. ఈ నివేదిక రాగానే ప్రభుత్వం వారి సమీప బంధువులకు ఎక్స్ గ్రేషియా అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వూల్లో పేర్కొంది.
అధికారిక రికార్డుల ప్రకారం గత ఏడాది జూలై 30 న సంభవించిన కొండచరియలు విరిగి పడటంతో 263 మంది చనిపోగా మరో 35 మంది గల్లంతయ్యారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ లను పరిశీలించాలని స్థానిక కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే తప్పిపోయిన వ్యక్తి గురించి తహశీల్దార్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వివరణాత్మక విచారణ నిర్వహించాలి. దర్యాప్తులో సేకరించిన వివరాలు అధికారిక వెబ్ సైట్ అలాగే ప్రభుత్వ గెజిట్ లో ప్రచురిస్తారు. దీనిపై ఏవైన అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు తెలియజేయాలి. ఆ తరువాత తప్పిపోయిన వారి జాబితాను ప్రచురించి వారి సమీప బంధువులకు మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.