పన్ను కేటాయింపులో కేంద్రంపై సిద్ధరామయ్య సీరియస్..

పన్ను కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా ప్రతి కన్నడీగుడు గళం విప్పాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.

Update: 2024-10-13 10:06 GMT

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. పన్నుల పంపిణీలో తక్కువ నిధులు కేటాయిస్తూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఇబ్బందులెదుర్కొంటోందన్నారు. తాము చెల్లిస్తున్న పన్నులు అవినీతి, దుష్పరిపాలిత రాష్ట్రాలకు వెళ్తున్నాయని మండిపడ్డారు.

''పన్ను పంపిణీలో కర్ణాటకకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. అందుకు తాజా లెక్కలే సాక్ష్యం. 28 రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం రూ.1,78,193 కోట్లు. కర్ణాటకకు ఇచ్చింది కేవలం రూ.6,498 కోట్లు. కేంద్రం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రతి కన్నడిగుడు కుల, మత, రాజకీయాలకు అతీతంగా గళం విప్పాలి. మోదీని ప్రశ్నించాలి. అన్యాయంపై విజయానికి ప్రతీకగా నిలిచిన ఈ విజయదశమి న్యాయం కోసం సమష్టి పోరాటానికి సిద్ధం కావాలి’’ అని కోరారు.

కర్ణాటక కంటే ఇతర రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడంపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు రూ.31,962 కోట్లు, బీహార్‌కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,987 కోట్లు, రాజస్థాన్‌కు రూ.10,737 కోట్లు కేటాయించారు. మా కష్టం, శ్రమ ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఎందుకు ఉపయోగపడాలి’’ అని ప్రశ్నించారు?

తగ్గిన పన్ను వాటా..

కర్ణాటక పాలన, అభివృద్ధిలో రాణిస్తుండగా.. ఆర్థిక ప్రతిఫలం మాత్రం ఇతర రాష్ట్రాలకు దక్కుతుందని మండిపడ్డారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కర్ణాటకకు టాక్స్ షేర్ 4.713 శాతం అందాలని సూచిస్తే, 15వ ఫైనాన్స్ కమిషన్ దానిని 3.647 శాతానికి తగ్గించిందని, ఫలితంగా 2021-2026 మధ్య రాష్ట్రానికి దాదాపు రూ.62,275 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు రూ.5,495 కోట్ల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసినా.. కేంద్రం నిధుల విడుదలకు నిరాకరించిందని వివరించారు. పన్ను పంపిణీలో అన్యాయంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి మొత్తం రూ.79,770 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.

జీఎస్టీ వృద్ధిలో అగ్రగామిగా..

దేశ జనాభాలో కర్ణాటక కేవలం 5 శాతం మాత్రమే ఉన్నా, జీడీపీకి 8.4 శాతం సహకరిస్తున్నదని, జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు.

"అయితే, కర్ణాటక వసూలు చేసే GSTలో కేవలం 52 శాతం మాత్రమే అందుకుంటుంది. GST ప్రవేశపెట్టినప్పటి నుంచి రూ. 59,274 కోట్లు కోల్పోయింది. ఏటా జాతీయ ఖజానాకు రూ. 4.5 లక్షల కోట్లు సమకూరుస్తున్నా.. రాష్ట్రానికి పన్ను వాటాలో రూ. 45వేల కోట్లు మాత్రమే అందుతున్నాయి. గ్రాంట్ల రూపంలో రూ. 15 వేల కోట్లు ఇస్తున్నారు. అంటే ప్రతి రూపాయికి కేవలం15 పైసలు ఇస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎంతకాలం సహించాలి.” అని కేంద్రాన్ని ప్రశ్నించారు సిద్ధరామయ్య.

గత ఎనిమిదేళ్లలో కేంద్ర బడ్జెట్ 2018-19లో రూ. 24.42 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి రూ. 48.20 లక్షల కోట్లకు రెట్టింపు అయినా.. కర్ణాటక వాటా స్తబ్దుగా ఉందని సిద్ధరామయ్య చెప్పారు. 2018-19లో రాష్ట్రానికి రూ.46,288 కోట్లు రాగా, 2024-25లో రూ.15,299 కోట్లు, అదనపు గ్రాంటుగా రూ.44,485 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.

మా వాట ఎందుకు ఇవ్వరు?

కర్ణాటకకు ఏటా కనీసం రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని, అయితే న్యాయమైన వాటా రావడం లేదని సిద్ధరామయ్య ప్రశ్నిస్తున్నారు. ‘‘15వ ఆర్థిక సంఘం బెంగుళూరు పెరిఫెరల్ రింగ్ రోడ్, నీటి వనరుల ప్రాజెక్టులకు ప్రత్యేక గ్రాంట్లు అలాగే రూ. 6వేల కోట్ల అదనపు నిధులు రూ.5,495 కోట్లు అవసరమని సిఫార్సు చేసింది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ సిఫార్సులను తిరస్కరించారు. ఫలితంగా కర్ణాటక రూ. 11,495 కోట్లు కోల్పోయింది’’ అని వెల్లడించారు.

'రాష్ట్ర ప్రభుత్వాలపై చిన్నచూపు'

ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌కు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నబోయాయని, 15వ ఆర్థిక సంఘం లక్ష్యాలకు సంబంధించిన మార్పులు దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు.

వరదల సమయంలోనూ అందని సహకారం..

వరదలు, కరువు సమయాల్లో కర్ణాటకకు కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదని సీఎం ఆరోపించారు. “కర్ణాటక వనరులు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడకపోతే పన్నుల వల్ల ప్రయోజనం ఏమిటి? కన్నడిగులు కష్టపడి సంపాదించిన డబ్బు సంక్షోభ సమయంలో వారి కన్నీళ్లు తుడవడానికి ఉపయోగించకపోతే, సమాఖ్య నిర్మాణ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News