Kerala Politics | రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయి.

పాలక్కాడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపొందిన రాహుల్ మమ్‌కూటతిల్ వ్యాఖ్యల వెనక అర్థమేంటి? అసమ్మతి నేతలను ఆయన పరోక్షంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా?

Update: 2024-11-27 10:13 GMT

రానున్న రోజుల్లో జిల్లాలో బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతారని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటతిల్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ, సీపీఐ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అభ్యర్థులను వరుసగా రెండు, మూడు స్థానాల్లోకి నెట్టారు. ఓటింగ్ సరళిని బట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం తన గెలుపుతో అర్థమైందన్నారు. ఉప ఎన్నికకు ముందు బీజేపీ అసమ్మతి నేత సందీప్ వారియర్ కాంగ్రెస్‌లో చేరడం గురించి అడిగిన ప్రశ్నకు "సందీప్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కొన్ని ఓట్లకు పరిమితం చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఆయన మత రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం నుంచి బయటకు వచ్చారు.”అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. కాంగ్రెస్ నేతలు పార్టీలు మారడంపై అడిగిన ప్రశ్నకు.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ. మా పార్టీ సిద్ధాంతం నుంచి అనేక పార్టీలు ఆవిర్భవించాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో ఎన్‌సీపీ అందుకు ఉదాహరణ’’ అని చెప్పుకొచ్చారు.

పాలక్కాడ్ మునిసిపాలిటీలో అసంతృప్త బీజేపీ కౌన్సిలర్లతో తమ పార్టీ ఎలాంటి చర్చలు జరపలేదని మమ్‌కూటతిల్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ సిద్ధాంతాలను ఎవరు స్వీకరించినా ఆహ్వానిస్తామని చెప్పారు. పాలక్కాడ్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోవడంతో ఆ పార్టీలోని అసమ్మతి నేతలను తన వైపుకు తిప్పుకునే క్రమంలో ఎమ్మెల్యే ఇలా మాట్లాడారని కొందరంటున్నారు. అయితే జిల్లాలోని తమ పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి ఉందన్న వార్తలను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. మామకూటథిల్ 58,389 ఓట్లతో (42.27 శాతం) గెలుపొందారు. సీపీఐ(ఎం) బలపరిచిన పి సరిన్ 37,293 ఓట్లు (27 శాతం) సాధించారు.   

Tags:    

Similar News