సిద్ధరామయ్యకు క్లీన్ చిట్‌పై విమర్శలు
‘MUDA’ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట; "అది లోకాయుక్త నివేదిక కాదు. 'సిద్ధరామయ్య బచావో నివేదిక'," అని బీజేపీ నేతల కౌంటర్..;
MUDA కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారులే నిబంధనలు ఉల్లంఘించారని, వారిపై చర్య తీసుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ‘సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్’ శీర్షికన పలు పత్రికల్లో వచ్చిన వార్తలపై కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్. అశోక (Ashoka) స్పందించారు. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు నాటకమని, సిద్ధరామయ్యను కాపాడేందుకు తయారు చేసిన నివేదిక మాత్రమేనని ఆరోపించారు.
"అది లోకాయుక్త నివేదిక కాదు. కానీ 'సిద్ధరామయ్య బచావో నివేదిక'," అని అన్నారు. మొదటి సారి తన పాలనలో లోకాయుక్త సంస్థను బలహీనపరిచిన సిద్ధరామయ్య, ఇప్పుడు తన సెకండ్ టర్న్‌లో దాన్ని తన పావుగా మార్చుకున్నారని అశోక (Ashoka) ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర (Vijayendra) కూడా లోకాయుక్త పోలీసులపై విమర్శలు గుప్పించారు. "MUDA (Mysuru Urban Development Authority) కేసులో హైకోర్టు తీర్పు రాకముందే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఒత్తిడి కారణంగా ఇచ్చిన క్లీన్ చిట్," అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
తీర్పుపై గురువారం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. లోకాయుక్త తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలియదని, "నాకు తెలియని విషయంపై నేను ఏమీ చెప్పలేను," అని పేర్కొన్నారు.
అసలు కేసేమిటి?
సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి గతంలో మైసూరులోని మూడు ఎకరాల 16 గుంటల భూమిని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA)కి ఇచ్చారు. అందుకు ప్రతిగా మైసూరులోని ప్రధాన ప్రాంతాల్లో ఆమె 14 ప్లాట్లు పొందారన్నది ప్రధాన ఆరోపణ. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున స్వామిపై లోకాయుక్త పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.